Donald Trump : అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారడం లేదు. ఇరాన్‌పై అమెరికా దాడులకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే ఇరాన్ అధినేత అలీ ఖమేనీతోపాటు అతడి కొడుకు మొతాబా ఖమేనీని కూడా చంపాలని అమెరికా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియా సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఏ దేశమైనా మరో దేశంపై దాడి చేసేటప్పుడు అనేక ఆప్షన్స్ ఉంచుకుంటుంది. రకరకాల ప్లాన్స్ రచిస్తుంది.
ఏ పరిస్థితి ఎదురైతే ఎలా స్పందించాలి.. ఎలా వ్యవహరించాలి అనే అంశంలో చాలా ఆప్షన్స్ పెట్టుకుని యుద్ధానికి దిగుతుంది. దీనిలో ఒకటి ఇరాన్ అధినేతను అంతమొందించడం. ఇరాన్‌పై దాడులకు సంబంధించి సన్నాహాల్లో భాగంగా అమెరికా రక్షణ శాఖ.. అధ్యక్షుడు ట్రంప్ ముందు అనేక ఆప్షన్లు ఉంచింది. దీనిలో భాగంగా అవసరమైతే ఇరాన్ అధినేత ఖమేనీని, అతడి కొడుకు మొతాబాను కూడా చంపే అంశం కూడా ఉంది. కానీ, దీనిపై ట్రంప్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. బహుశా ట్రంప్ అలా ఆదేశిస్తారని కూడా తాను అనుకోవడం లేదని ఒక అధికారి అన్నారు. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదని అన్నాడు. ఒకవేళ ఖమేనీ, అతడు కొడుకును చంపాలి అనుకుంటే అందుకు తగిన ప్లాన్ గురించి కూడా ఇప్పటికే ట్రంప్‌తో అధికారులు చర్చించినట్లు మరో అధికారి వెల్లడించారు.
ఖమేనీ అంతమైతే.. అతడి కొడుకు ఇరాన్ అధినేతగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అందుకే ఖమేనీతోపాటు అతడి కొడుకును కూడా అంతమొందించాలని అమెరికా భావిస్తోంది. ప్రస్తుతం అమెరికా.. ఇరాన్‌పై దాడి సన్నాహాల్లో ఉంది. దాడి తర్వాత అప్పటి పరిణామాలను బట్టి ఖమేనీ విషయంలో ట్రంప్ నిర్ణయం తీసుకుంటారు. ఏం జరుగుతుందనేది ట్రంప్‌నకు మాత్రమే తెలుసనేది అమెరికా అధికారుల మాట.