c
అక్కడ భావోద్వేగాలను అడుక్కునే వారుంటారు
వికృతమైన చేష్టలు చేస్తూ జీవితంపై చాడీలు చెప్తూ
ఒక దిష్టిబొమ్మను తయారు చేస్తారు
పొలాల్లో పచ్చని చెట్లకు నల్లటి రంగు వేస్తూ
కోపంగా మనవైపే చూస్తుంటారు
ముచ్చటించరు చెమటలు తాగుతారు
మన ఆనందాల కాలువలో స్నానాలాడుతారు
ఓ సోదరీ అటు మనం ఎక్కలేని మెట్లు
అవి అమ్ముకున్నవి అక్రమంగా
కొన్ని రాత్రుల నుంచి పడిగాపులు గాచిన కాళ్లకు
రెండో మూడో ఇచ్చి కానిచ్చేస్తారు
మిగిలినవన్నీ అంతే అనుకుంటాం మనం
అసంబద్ధంగా ప్రశ్నార్థకమైన కళ్లు ఎన్నో
పోదామా ఇట్లాగే వెనుదిరుగుదామా
మనకూ ఉన్నాయి కదా కొన్ని స్వార్థపూరిత సవాళ్లు
వాటి మధ్యలో వీటిని లేపాలి
కొండ ముందు పొట్టేలు లాగా కనీసం నిలబడదాం రా
ఖాళీ స్థలం చూసుకొని
మన ఒంట్లో నుంచి బరువెక్కిన గాలిని పోగొట్టుకుందాం రా
అరుద్దాం రా ఆకాశం కేసి కాసేపు..!
వగ్గు రఘువీర్