వరంగల్ : కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఉమ్మడి వరంగల్ ( Warangal ) జిల్లా యువకులు. దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయిన యూపీఎస్సీ ఫలితాల్లో (UPSC Results) ర్యాంకులు పొందారు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి పుట్టెడు దుఃఖాన్నిగుండెల్లో దాచుకొని నానమ్మ పారిశుద్ధ్య కష్టాన్ని కండ్లారా చూసి ఎదిగిన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ ( Praveen ) తన కృషి, పట్టుదలతో సివిల్స్ ఫలితాల్లో 793వ ర్యాంక్ సాధించి ములుగు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. గ్రూప్–1 పరీక్షల్లో 105వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికైన ప్రవీణ్, డీఎస్పీ శిక్షణ పొందుతూనే తాజాగా విడుదలైన యూపీఎస్సీలో ర్యాంక్‌ను సాధించి అందరికి ఆదర్శంగా నిలిచాడు.
హనుమకొండ జిల్లా న్యూశాయంపేటకు చెందిన గుండు అఖిలేష్ ( Akhilesh ) ఆల్ ఇండియా సర్వీస్ ఐపీఎస్ 464 ర్యాంకును సాధించి ప్రతిభను చాటాడు. అఖిలేష్ తండ్రి భూపాలపల్లిలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. తల్లి సరస్వతి గృహిణిగా ఇంటి బాధ్యతలను నిర్వహిస్తోంది.అఖిలేష్ 2013లో హనుమకొండ హంటర్ రోడ్డులోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతిలో ఉత్తమ ర్యాంకును సాధించాడు.అఖిలేష్ యూపీఎస్సీలో విజయం సాధించడం పట్ల తల్లిండ్రులు, స్థానికులు హర్షం వెలిబుచ్చారు.
కాజీపేట పట్టణం 61 వ డివిజన్ ప్రశాంత్ నగర్ ఫేస్ 3లో నివాసం ఉంటున్న అట్లా తరుణ్ తేజ ( Tarunteja ) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలలో 123వ ర్యాంకు తో సత్తా చాటారు. కుమారుడు సివిల్ సర్వీస్‌లో మెరుగైన ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు అట్ల రవీందర్- అమరావతి సంతోషం వ్యక్తం చేశారు.