Iran War : ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచంపై చాలానే ఉంది. ముఖ్యంగా ఇండియాపై దీని ప్రభావాన్ని కాదనలేం. చమురు విషయంలో దేశానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు మాత్రం నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇండియాలో పండే బాస్మతి బియ్యం ఎగుమతి ఆగిపోయింది. రవాణా జరిగే హోర్ముజ్ జలసంధిపై ఆంక్షలు, పలు నౌకలు నిలిచిపోవడం వల్ల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేయడం లేదు.
వ్యాపారవర్గాల తాజా అంచనా ప్రకారం మొత్తం 4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. ఇందులో కొంత మార్గ మధ్యలో నౌకల్లో నిలిచిపోగా, ఇంకొంత పోర్టుల్లో, గోడౌన్లలో నిలిచిపోయింది. దీంతో వ్యాపారులు, రైతులు, మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారు. బాస్మతి బియ్యం ఎగుమతుల్లో ఇండియాది అగ్రస్థానం. అందులోనూ మనం పండించే బాస్మతి బియ్యం ఎక్కువగా ఇరాన్ సహా సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ వంటి గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలకే వెళ్తుంది. మన దేశంలోని 50 శాతం ఎగుమతులు ఈ దేశాలకు ఎగుమతి అవుతాయి. అలాంటిది ఇప్పుడు ఈ దేశాలు యుద్ధ సంక్షోభంలో చిక్కుకోవడంతో ఎగుమతులపై ప్రభావం పడుతోంది. అంతర్జాతీయంగా రవాణా నిలిచిపోవడంతో దేశీయంగా బాస్మతి ధరలు తగ్గుతున్నాయి.
క్వింటాల్‌కు సగటున రూ.1,000 వరకు ఇండియాలో ధరలు తగ్గుతున్నట్లు వ్యాపారవర్గాలు తెలిపాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌పై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని అంటున్నారు. మన దేశం నుంచి రవాణా అయ్యే ఇతర ఉత్పత్తులపై కూడా ఇదే తరహా ప్రభావం ఉంది. మధ్యప్రదేశ్‌లోని అరుదైన బర్వాని రకం అరటి ఎగుమతులు కూడా ఆగిపోయాయి. ఈ సంక్షోభం నివారణ అయితే, తిరిగి వ్యాపారం పుంజుకుంటుందని రైతులు, వ్యాపారులు ఆశిస్తున్నారు.