శతాబ్దాల తరబడి మౌఖికంగానే ప్రాచుర్యంలో ఉన్న జానపద సంగీతాన్ని వెలుగులోకి తీసుకువచ్చి జానపద సంగీతానికి స్వరలిపి రాసి, ఆకాశవాణి ద్వారా ప్రసారం చేసి, కచేరీ స్థాయికి తీసుకెళ్లిన తొలి మహిళామణి వింజమూరి (అవసరాల) అనసూయ. 1938లో ఆకాశవాణి ఆరంభమే అనసూయ గాత్రంతో మొదలైంది. తర్వాత వింజమూరి సీతాఅనసూయ అనే పేరు జానపద సంగీతానికే ఒక ఐకాన్‌గా నిలిచింది. అంతేకాదు, లలిత సంగీతానికి కూడా అనసూయనే ఆద్యురాలు. సంగీత సభలోకి భావగీతమనే గాన విధానాన్ని పరిచయం చేసింది కూడా అనసూయే.
కాకినాడలో వింజమూరి లక్ష్మీనరసింహారావు-వెంకటరత్నమ్మ దంపతులకు 1920, మే 12న అనసూయ జన్మించారు. ఈమె చెల్లెలే వింజమూరి సీత. వెంకటరత్నమ్మ ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి సోదరి. ఆమె 1914-1939 ప్రాంతంలో ‘అనసూయ’ అనే సాంస్కృతిక మాస పత్రికను నిర్వహించారు. ఇది తెలుగు నాట వెలువడిన తొలి మాసపత్రిక కావడం విశేషం. అనసూయ తన తొమ్మిదో ఏటనే మేనమామ దేవులపల్లి గీతాలకు చక్కని ట్యూన్లు కట్టేవారు. అంతేకాదు, హరీంద్రనాథ ఛటోపాధ్యాయకు సహకరించడం ఆమె ప్రతిభకు నిదర్శనం. 1938లో మద్రాసులో ఆలిండియా రేడియో ప్రారంభించిన రోజున (ఫిబ్రవరి 20) తొలి ప్రసారమైన ముద్దుకృష్ణ రాసిన అనార్కలి నాటికలో ‘రారమ్మ రారమ్మ మందారమా’ మొదలైన పాటలు పాడిన తొలి రేడియో గాయనిగా ఆకాశవాణి చరిత్రలో అనసూయ పేరు నమోదైంది. 1940లలోనే వింజమూరి అనసూయదేవి తొలితరం సినీ హీరో అవసరాల శేషగిరిరావును వివాహమాడారు.
1941లో ఆకాశవాణి మద్రాసువారు అనసూయ ప్రతిభను గుర్తించి డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే నిబంధనలు సడలించి కంపోజర్ ఉద్యోగం ఇచ్చారు. దాంతో అంతవరకు ప్రశాంత గోదావరిలా సాగిన అనసూయ స్వరజీవనం ఉరకలెత్తే గోదావరిగా మారింది. ఆకాశవాణిలో తన చెల్లెలు సీతను సహ గాయనిగా చేసుకున్న తదుపరి ‘వింజమూరి సీతా అనసూయ’గా మారి, అశేష శ్రోతలకు, పండిత పామరులకు చి(స్వ)ర పరిచితులయ్యారు.
1947 ఆగస్టు 15న అనసూయ ఆకాశవాణిలో ‘స్వాతంత్య్ర రథం’ నాటికలో పాడారు. జానపద, లలిత సంగీతానికి అనసూయ చేసి న సేవల గురించి రాయాలంటే ఒక గ్రంథమే అవుతుంది. అనసూయ కృషి వల్లనే 1962లో నాటి సమాచార ప్రసార శాఖమంత్రి బెజవాడ గోపాలరెడ్డి ఆకాశవాణిలో జానపద సంగీత శాఖను ఏర్పాటుచేశారు. ‘మొక్కజొన్న తోట లో, కొయ్యోడు, వల్లారి బాబో, ఎయిర సిన్నోడెయిరా, అంతే నాకు చాలు తమలపాకు’ మొదలైనవి ఆమె స్వరపరిచిన వేలాది జానపదాలలో కొన్ని. తొలిటాకీల కాలంలోనే అనసూయకు సినిమాల్లో నూ అవకాశాలు వచ్చాయి.
1948 లో బీఎన్ మల్లీశ్వరి చిత్రంలో ‘నోముల నోమల్లాల’, ‘మనసున మల్లెల మాలలూగెనో’ పాటలకు ఆమె బాణీలందించారు. 1962లో రాజ్‌కుమార్ నటించిన కన్నడ చిత్రం ‘మహాత్మా కబీర్’కు తొలిసారి పూర్తిస్థాయి సంగీత దర్శకురాలయ్యారు. అనసూయ ఉత్తమ రచయిత్రి కూడా. సంగీత సాహిత్యాలపై ఆమె 11 గ్రంథాలు రచించారు. సంగీత ప్రపంచానికి ఎంతో సేవ చేసిన అనసూయ 2019 మార్చి 23న స్వర్గస్థులయ్యారు.
అనసూయ స్వరం అజరామరం. తెలుగు జానపద సంగీతానికి వరం. ఆమె సుదీర్ఘ స్వరజీవన ప్రస్థానంలో అన్యస్వరమే కానీ అపస్వరం లేదు. అసమాన అనసూయగా ఆమె నిరంతరం వెలిగే అవస(స్వ)రాల భాస్వరం.
డాక్టర్ వి.వి.రామారావు
98492 34663