Women | మహిళలు ఆరోగ్యంగా ఉండడమంటే కేవలం వ్యాధులు లేకుండా ఉండడమే కాదు. ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం కూడా ఇందులో భాగమే. ప్రస్తుతం శరీర ఆరోగ్యాన్ని చూసే విధానం కూడా మారిందని చెప్పవచ్చు. కండరాల బలం, మెటబాలిజం, అలాగే ఏఐ సహాయంతో జరిగే పరీక్షలు వంటి విషయాలు ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నాయని చెప్పవచ్చు. యుక్త వయసులో ఉన్నా, వయసు పెరిగే దశలో ఉన్నా లేదా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని చూస్తున్నా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. జర్నల్ ఆఫ్ ఉమెన్స్ హెల్త్ కేర్ లో ప్రచురరితమైన ఒక అధ్యయనం ప్రకారం ముందస్తు ఆరోగ్య పరీక్షలు మహిళలకు శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని నియంత్రించడంలో సహాయపడతాయని సమయానికి సమస్యలను గుర్తించడం వల్ల వ్యాధులు తీవ్రమవ్వకుండా అడ్డుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
అలాగే బిఎమ్సి హెల్త్ లో వచ్చిన పరిశోధనల ప్రకారం మహిళల ఆరోగ్య పరీక్షలు వయస్సు దశల ప్రకారం ఉండాలని సూచిస్తున్నాయి. యవ్వనం, ప్రసవ వయస్సు, మెనోపాజ్, మెనోపాజ్ తర్వాత ఇలా ప్రతి దశలో వచ్చే ఆరోగ్య ప్రమాదాలు భిన్నంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే 20 ఏళ్ల వయసులో మహిళలు చేయించుకోవాల్సిన ముఖ్యమైన పరీక్షల గురించి కూడా వారు తెలియజేస్తున్నారు. 21 ఏళ్ల వయసు నుండి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ సెమర్ పరీక్ష చేయించుకోవాలి. హెచ్పీవీ వ్యాక్సిన్ 45 సంవత్సరాల వరకు ఇప్పుడు అందుబాటులో ఉంది. కాబట్టి ఈ దశలో వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
వివాహం తరువాత సంబంధాలు ప్రారంభమవుతాయి. ఈ వయసులో చ్లామిడియా, సిఫిలిస్ వంటి లైంగిక వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా అవసరం. ఇది భవిష్యత్తులో సంతానోత్సత్తి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే సీబీపీ వంటి రక్తపరీక్షలతో పాటు విటమిన్ బి12, విటమిన్ డి వంటి రక్తపరీక్షలు కూడా చేయించుకోవాలి. అలాగే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా అవసరం. ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి క్లినికల్ చెకప్ చేయించుకోవడం మంచిది. 20 సంవత్సరాల వయసు నుండి ప్రతి సంవత్సరం ఒకసారి బ్రెస్ట్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఈ పరీక్షలు బ్రెస్ట్ టిష్యూ సాధారణంగా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. మహిళలు ఈ విధమైన పరీక్షలు చేయించుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.