హైదరాబాద్ మహానగర ప్రజలకు వరద ముప్పు తప్పించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ఆడపాదడపా వర్షాలు కురుస్తున్నా.. నాలాల పునరుద్ధరణ పనులు మాత్రం అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. నిధుల కొరత, పాలకుల నిర్లక్ష్యం కలసి ఎస్ఎన్డీపీ ప్రాజెక్టుకు తీవ్ర గండంగా మారాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో హెచ్సిటీ ప్రాజెక్టు కింద రూ.2,650 కోట్ల మేర నిధులు బడ్జెట్లో కేటాయించగా, ఇప్పటి వరకు కనీసం త్రైమాసిక వాటా నిధులు మంజూరు చేయకపోవడం గమనార్హం.
ఈ ప్రభావంతో చాలా ప్రాంతాల్లో పనులు అర్ధంతరంగా నిలిచిపోగా, మరికొన్ని చోట్ల ఫేజ్- 2 పనుల ప్రతిపాదనలు టెండర్ల దశ దాటడం లేదు. గడిచిన రెండున్నరరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పురోగతిలో ఉన్న మొదటి దశ పనులను పూర్తి చేయలేకపోగా.. రెండో దశ పనులను పూర్తి స్థాయిలో పట్టాలెక్కించ లేదు. మొదటి దశ పురోగతిలో ఉన్న ఏ ఒక్క చోట పూర్తి చేయలేకపోవడం, రెండో దశలో 57.401 కిలోమీటర్లలో రూ.667.28కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించి ఇప్పటికీ చాలా వరకు టెండర్ల దశలోనే కాలయాపన చేస్తున్న తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.

సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ఏటా వర్షాకాలం వచ్చిదంటే చాలు నగర వాసుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. గడిచిన రెండేళ్లలో వరద ముంపుతో ఉక్కిరిబిక్కిరైన లోతట్టు, కాలనీ వాసుల భయాన్ని తొలగించాల్సిన అధికారులు నిర్లక్ష్యపు మత్తులో పనులను చేతులేత్తేశారు. కీలక నాలా విస్తరణ, బాక్స్ డ్రైన్ల నిర్మాణ పనులు చాలా ప్రాంతాల్లో అర్థాంతరంగా నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల నాలాలు సగం తవ్వి వదిలేయడం, ప్రధాన నాలాల అనుసందాన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇబ్బందులకు గురి చేసే అంశం. చేసిన పనులకు జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించడం లేదని , పెండింగ్ బిల్లులు ఇస్తేనే పనులు చేపడతామంటూ కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. పనులను చకచకా పూర్తి చేసేందుకు అనుకూలమైన ఈ వేసవిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ప్రస్తుతం వర్షాకాలం వచ్చిన దరిమిలా మళ్లీ అదే వరద, ఆదే సమస్య అన్నట్లుగా స్థానికుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నది.
