ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ఘజియాబాద్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థిని.. 12వ అంతస్తు నుంచి కిందపడి మృతిచెందింది. బాల్కనీలో ఆరేసిన దుస్తుల్ని తెచ్చేందుకు వెళ్లి ఆమె బిల్డింగ్ మీద నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని 14 ఏళ్ల ప్రాచీగా గుర్తించారు. రాజ్ నగర్ ఎక్స్టెన్షన్లో నివాసం ఉంటున్న ఆ అమ్మాయి.. సంజయ్ నగర్‌లోని డెహ్రాడూన్ పబ్లిక్ స్కూల్లో చదువుతోంది. రాజ్‌నగర్ రెసిడెన్సీ సొసైటీలోని టవర్ జీ వద్ద రాత్రి 9 గంటల సమయంలో ప్రాచీ బిల్డింగ్ నుంచి కింద పడింది. స్థానికులు అమ్మాయిని సమీపంలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. మృతికి చెందిన కారణాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పోస్టు మార్టమ్ నిర్వహిస్తున్నారు.
నంద్‌గ్రామ్ పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ప్రాచీ రెండు రోజుల క్రితమే షిర్డి నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. సీబీఎస్ఈ రోప్ స్కిప్పింగ్ జాతీయ పోటీల్లో పాల్గొని రెండు స్వర్ణ పతకాలను ఆమె గెలుచుకున్నది. డబుల్ డచ్ పెయిర్ ఫ్రీ స్టైయిల్, డబుల్ డచ్ సింగిల్ ఫ్రీ స్టైయిల్ కేటగిరీల్లో ఆమె మెడల్స్ సాధించింది. అయితే విక్టరీ సెలబ్రేషన్ మూడ్‌లో ఉండగా.. ఈ ఘటన ఆ ఫ్యామిలీలో విషాదాన్ని నింపింది. ప్రాచీ తండ్రి సురేశ్ చాంద్ ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఘటన జరిగిన సమయంలో ప్రాచీ పేరెంట్స్, సోదరి, గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇంట్లో ఉన్నారు.