కోటి రూపాయల పరిహారం, ప్లాటు, గ్రామ అవసరాల కోసం భూములిస్తేనే తమ భూములిస్తామని, లేదంటే కోర్టు తీర్పు మేరకు మా భూములు మాకిచ్చి పూర్తి అధికారాలు కల్పించాలని పలువురు ఫార్మా బాధిత అన్నదాతలు మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫార్మా బాధిత పట్టా భూముల రైతులతో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే రంగారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి చర్చలు జరిపారు. ఈ చర్చలకు కొంతమంది కాంగ్రెస్ అనుకూల అన్నదాతలకు మాత్రమే ఆహ్వానం పంపారని, తమ భూములు పోతున్నప్పటికీ మమ్ముల్ని పిలువలేదని పలువురు రైతులు ఆరోపించారు. కాగా, ఫార్మా వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ కవుల సరస్వతిని చర్చలకు అనుమతించలేదు. దీంతో మంత్రి శ్రీధర్‌బాబు అన్నదాతలతో జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగిసాయి.
రంగారెడ్డి, జూలై 22 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫార్మా భూసేకరణలో భాగంగా పట్టా భూములు కోల్పోతున్న రైతుల భూములను తిరిగి వారికే ఇస్తామని, ఆ భూములపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి అన్నలకు పూర్తి హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారని.. కాంగ్రెస్ పాలన రెండున్నర సంవత్సరాలు దాటినప్పటికీ పట్టా భూముల అన్నదాతల సమస్యలు పరిష్కరించలేదన్నారు. ముఖ్యంగా తాము అధికారంలోకి వస్తే పట్టా భూముల రైతులకు వారి డిమాండ్ మేరకు నిషేధిత జాబితా నుంచి పేర్లను తొలగించి ఆ భూములపై పూర్తి హక్కులు అన్నదాతలకే ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, రైతు కమిషన్ చైర్మన్ కోదంరెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి హామీ ఇచ్చారని..
హామీ మేరకు వెంటనే న్యాయం చేయాలని కొంతమంది రైతులు కోరారు. మరికొంతమంది అన్నదాతలు మాత్రం తమ పట్టా భూములను ఎట్టి పరిస్థితిల్లోనూ ఇచ్చేది లేదని, భూసేకరణ నోటిఫికేషన్ అస్తవ్యస్తంగా ఉందని, దీనిపై తాము కోర్టును ఆశ్రయించగా.. రైతుల అంగీకారం లేకుండా భూసేకరణ జరపడం నేరమని, అన్నదాతలను ఒప్పించిన మీదటే భూములు తీసుకోవాలని, అప్పటివరకు భూముల వద్దకు వెళ్లవద్దని కోర్టు కూడా ఆదేశించిందని రైతులు తెలిపారు.
చర్చలకు దూరంగా కవుల సరస్వతి
రైతులతో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే రంగారెడ్డి జరిపిన చర్చల్లో ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ కవుల సరస్వతి దూరంగా ఉన్నారు. ఈ చర్చలకు ఆమెను అనుమతించలేదని తెలిసింది. చర్చల్లో భూములివ్వడానికి అంగీకారం తెలిపిన అన్నదాతలు మాత్రమే పాల్గొనడం గమ నార్హం. సర్కారుకు అనుకూలంగా ఉన్నవారు మాత్రమే భూములిస్తామని ముందుకొచ్చారని.. మిగతా రైతులు మాత్రం భూములివ్వబోమని తెలుపడంతో మంత్రి మరోమారు బాధిత అన్నదాతలందరినీ పిలిపించి చర్చిస్తామని హామీ ఇచ్చారు.
అర్ధాంతరంగా ముగిసిన చర్చలు
మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే రంగారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి రైతులతో జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగిసాయి. ఈ చర్చల సందర్భంగా పాల్గొన్న అన్నదాతలు తమ డిమాండ్లను మంత్రి ముందు ఉంచారు. గత ఎన్నికల ముందు తమ గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి వస్తే సేకరించిన రైతుల పట్టా భూములను తిరిగి వారికే ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు తమ భూములను తమకు ఇవ్వాలని, నిషేధిత జాబితా నుంచి తొలగించి అన్నదాతల భూములపై పూర్తి హక్కులు రైతులకే కల్పించాలని కొంతమంది అన్నదాతలు కోరారు.
కాగా.. మరికొంతమంది రైతులు మాత్రం పట్టా భూములకు ఎకరాకు కోటి రూపాయల పరిహారమివ్వాలని, అలాగే, ఇంటి స్థలాన్ని కూడా ఇవ్వాలని కోరారు. గ్రామ అవసరాల కోసం ప్రతి గ్రామానికి మూడు నుంచి ఐదువందల ఎకరాలను వదిలిపెట్టాలని కోరారు. భూసేకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వలేదని.. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అన్నదాతల డిమాండ్లను విన్న మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే రంగారెడ్డి, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు..
జీవోను రద్దుచేసి తిరిగి భూములను అందజేయాలి
ఫార్మాసిటీ ఏర్పాటు పేరుతో భూసేకరణ చేసిన భూములను తిరిగి రైతులకు అందజేసి, ఫార్మాసిటీ జీవోను రద్దు చేయాలని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ కవుల సరస్వతి అన్నారు. బుధవారం అన్నదాతలతో ప్రభుత్వం జరిపిన చర్చలకు తనను ఆహ్వానించకపోగా.. తాను రావద్దని కూడా చెప్పారని తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, కోదండరాం, మల్రెడ్డి, కోదండరెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించి తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటిని రద్దుచేసి ఆ భూములను తిరిగి అన్నదాతలకే ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూములను ఫ్యూచర్ సిటికీ వాడుకోవడం చట్టవ్యతిరేకమని పేర్కొన్నారు. నాలుగు గ్రామాలకు చెందిన రైతుల నుంచి బలవంతంగా 2500 ఎకరాల పట్టా భూములను సర్కారు.. వారి అంగీకారం లేకుండానే సేకరించి పరిహారాన్ని అథారిటీలో జమ చేసి భూములను నిషేధిత జాబితాలో చేర్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పర్యటించినవారంతా మంత్రులయ్యారని, అయినప్పటికీ తిరిగి అన్నదాతల భూములను వారికి ఇవ్వడంలేదన్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ పట్టా భూములను ప్రభుత్వానికిచ్చేది లేదని, ఆ భూములపై ఉన్న నిషేధాన్ని తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించాలని కోరారు.
అన్నదాతల సమస్యలను వెంటనే తేల్చాలి
ఫార్మాసిటీ భూసేకరణలో పట్టా భూములు కోల్పోతున్న రైతులను చర్చలకు పిలిచి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే సర్కారు బదునామవుతుందని కాంగ్రెస్‌కు చెందిన మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అన్నదాతల పట్టా భూములను వారి అభిప్రాయం మేరకు తీసుకోకుండా భూసేకరణ జరిపారని, భూసేకరణ పూర్తిగా చట్టవిరుద్ధమని కోర్టు కూడా అభిప్రాయపడిందన్నారు. వెంటనే ప్రభుత్వం రైతుల అభిప్రాయాలు తీసుకుని వారి అభీష్టం మేరకు పరిహారాన్ని ఇవ్వాలని కోరారు.