బోధన్, జూలై 22: కాంగ్రెస్ పాలనలో పచ్చదనంపై పట్టింపు లేకుండా పోయింది. ‘హరితహారం’ను వన మహోత్సవంగా పేరు మార్చిన సర్కారు దీన్నో మొక్కుబడి కార్యక్రమంగా మార్చేసింది. పల్లె, పట్టణ ప్రకృతి వనాల నిర్వహణను గాలికొదిలేసిన ప్రభుత్వం.. అవి కనుమరగువుతున్నా కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. వాస్తవానికి రేవంత్ సర్కారు వచ్చాక కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు కోత పెట్టింది. అభివృద్ధి కార్యక్రమాలను అటకెక్కించింది. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలకు మంగళం పాడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హరితహారం వంటి కార్యక్రమాలపైనా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నది. ఫలితంగా పచ్చదనం అంతరించి పోతున్నది.
నాడు ఉద్యమంలా హరితహారం..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా నడిపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చొరవతో, ప్రజల భాగస్వామ్యంతో.. మోడువారిన పల్లెలన్నీ ‘హరితహారం’తో చిగురించాయి. దీంతో జిల్లాలోని పల్లెలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ప్రతి గ్రామంలోనూ పల్లె ప్రకృతి వనాలు ఏర్పడ్డాయి. పట్టణాల్లో ఉండే ఉద్యానవనాల మాదిరిగా మారుమూల పల్లెల్లోనూ ప్రకృతి వనాలు వెలిశాయి. పట్టణాల్లోనూ పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటు ముమ్మరంగా సాగింది.
ఇవి ఆహ్లాదంతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు చేశాయి. వర్షాలు కురవాలన్నా, భూగోళ ఉష్ణ తాపం తగ్గాలన్నా.. మొక్కల పెంపకం ఆవశ్యకతను గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం ‘హరితహారం’ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించింది. ఇప్పుడా స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘హరితహారం’ను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మొక్కలు పెంచడం దండుగ అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందన్న విమర్శలు వస్తున్నాయి. కొత్తగా మొక్కలు, వనాలను పెంచాల్సింది పోయి, కేసీఆర్ హయాంలో పల్లెలకు, పట్టణాలకు ఎంతో శోభను తీసుకువచ్చిన ప్రకృతి వనాలను నిర్లక్ష్యం చేస్తుండడం విస్మయం కలిగిస్తున్నది.
ఇది యాదాద్రి ప్లాంటేషన్ దుర్గతి..
బీఆర్ఎస్ హయాంలో పట్టణాల్లో పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటుచేయగా, ఇప్పుడవి క్రమంగా కనుమరుగవుతున్నాయి. బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా అప్పట్లో పట్టణ ప్రకృతి వనం ఎంతో ఆహ్లాదకరంగా కనిపించేంది. ఇప్పుడక్కడా ఆ వనమే లేకుండా పోయింది. నాడు ప్రతి పట్టణంలోనూ, నగరంలోనూ యాదాద్రి ప్లాంటేషన్లను ఏర్పాటు చేశారు. ఏపుగా పెరిగే చెట్లతో ఒక అరణ్యంలా ఉండాలన్న లక్ష్యంతో యాదాద్రి ప్లాంటేషన్లకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడా ప్లాంటేషన్‌లో చెట్లు కనిపించని దుస్థితి నెలకొన్నది. బోధన్ ఆచన్‌పల్లి వద్ద ఉన్న యాదాద్రి ప్లాంటేషన్‌లో బోర్డు తప్ప చెట్లు కనిపించడంలేదు. కనిపిస్తున్న అతి కొద్ది మొక్కలు కూడా ఎండిపోయాయి. మిగతా పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.

‘వన మహోత్సవం’ మొక్కుబడిగానే..?
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ‘వన మహోత్సవం’ పేరుతో ప్రారంభించిన ‘హరితహారం’ కేవలం మొక్కుబడిగానే సాగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద డీఆర్డీఏ ఆధ్వర్యంలో 26.11 లక్షల మొక్కలు నాటేందుకు నిధులు కేటాయించారు. అటవీ శాఖ 65 వేలు, నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల ఆధ్వర్యంలో 17.50 లక్షలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో లక్ష మొక్కలు, ఇతర శాఖల ఆధ్వర్యంలో మరో 45 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ఇలా.. మొత్తం 45.71 లక్షల మొక్కలను ఈ ఏడాది ‘హరితహారం’లో నాటాల్సి ఉండగా, ఇందుకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో సన్నాహాలు జరగడం లేదు. వర్షాలు కురువడం లేదన్న సాకుతో ఈ కార్యక్రమం అమలుకు మొదటికే మోసం తెచ్చేటట్టుగా పాలకుల వైఖరిగా ఉంది. వాస్తవానికి, ఈ ఏడాది లక్ష్యం గతేడాది టార్గెట్ కంటే తక్కువగా ఉండటం గమనార్హం. గతేడాది లక్ష్యం 51.49 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, వాస్తవానికి ఏ మేరకు మొక్కలు నాటారన్నది అనుమానస్పదమే. కాకి లెక్కలతో మొక్కలు నాటే పనులు తూతూమంత్రంగా జరిగాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
గతేడాది కంటే ఈ సారి మొక్కల లక్ష్యం 5.78 లక్షల మేరకు తగ్గించారు. గత నెల 18న సీఎం రేవంత్‌రెడ్డి ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అయితే, నెల దాటినా క్షేత్ర స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం ముందుకు సాగడం లేదు. ‘వన మహోత్సవం’లోప్రజలను భాగస్వాములను చేసేలా ఎటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం లేదు. మరో వారం రోజుల్లో జూలై ముగిసి ఆగస్టు ప్రారంభమవుతున్నప్పటికీ.. మొక్కలు నాటే కార్యక్రమం పట్టాలెక్కక పోవడం గమనార్హం. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 6 లక్షల మొక్కలు నాటినట్లుగా సంబంధిత అధికారులు చెబుతున్నారు.
అది కూడా ఉపాధి హామీ పథకం నిధులతోనే. అయినప్పటికీ, లక్ష్యానికి ఆ శాఖ చాలాదూరంగా ఉన్నట్లే లెక్క. ఇక, మున్సిపాలిటీలు, ఇతర శాఖలు ఈ విషయంలో ముందడుగు వేయటం లేదు. నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మున్సిపాలిటీలు, జీపీలు ‘వన మహోత్సవం’లో చొరవ చూపడం లేదు. మొక్కలు నాటడమే కాకుండా నీరు పోసి రక్షించాల్సిన బాధ్యత వాటిపై ఉంది. పంచాయతీల్లో వాటర్ ట్యాంక్‌లు ఇప్పటికే మూలనపడ్డాయి. వాటికి మరమ్మతులు చేయాలన్న సోయి ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఈసారి వన మహోత్సవం (హరితహారం) మొక్కబడిగానే మిగిలి పోతుందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అదృశ్యమవుతున్న పల్లె ప్రకృతి వనాలు
జిల్లాలో అనేక గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు అంతరించిపోతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏఆర్పీ క్యాంప్‌లో పల్లె ప్రకృతి వనం అదృశ్యమైపోగా, ఇప్పుడక్కడ ఖాళీ మైదానమే కనిపిస్తున్నది. ఎడపల్లిలోని పల్లె ప్రకృతివనంలో చెట్లను కొట్టివేయడంతో అక్కడ మోడులు దర్శనమిస్తున్నాయి. ఇదే మాదిరిగా జిల్లా అంతటా ప్రకృతి వనాలు దీనావస్థలో ఉన్నాయి. సర్కారు పట్టించుకోక పోవడం, స్థానిక బాధ్యులు నిర్వహణను గాలికొదిలేయడంతో ప్రకృతి వనాలు కనుమరుగై పోతున్నాయి.
మోడు వారిన వనాలు..
జిల్లాలోని అనేక పల్లె, పట్టణ ప్రకృతి వనాలు బోసిపోయాయి. చెట్లు మోడువారి కనిపిస్తున్నాయి. కొన్ని చోట్లయితే.. అవి పూర్తిగా అదృశ్యమయ్యాయి. తుప్పు పట్టిన బోర్డుల ఆధారంగానే ఇక్కడ ప్రకృతి వనాలు ఉండేవని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపుగా పెరిగిన ప్రకృతి వనాలను పట్టించుకునే దిక్కులేకుండా పోవడంతో అవి ప్రస్తుతం నామమాత్రంగా మిగిలాయి. ప్రకృతి వనాల సంరక్షణకు నిధులు కేటాయించకపోవడం, నిర్వహణ విషయంలో ప్రజలకు, స్థానిక సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలన్న స్ఫూర్తి కొరవడడంతో ఈ దుస్థితి ఏర్పడింది.
జీపీలకు నిధులు ఇవ్వకుండా వాటిని నిర్వీర్యం చేయడంంతో పల్లె ప్రకృతి వనాలు నిస్సహాయంగా మారాయి. గతంలో జీపీలు ట్రాక్టర్లు, ట్యాంకర్లను సమకూర్చుకునేలా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దీంతో చిన్న గ్రామాల్లోనూ వాటర్ ట్యాంక్‌లతో మొక్కలకు నీటి సరఫరా జరిగేది. రేవంత్ సర్కార్ వచ్చిన వెంటనే పంచాయతీలకు నిధులు కరవయ్యాయి. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారాయి. ఇక, ప్రకృతి వనాలను కాపాడే బాధ్యతను పంచాయతీలు మర్చిపోయాయి.