Raghu Rama Krishna Raju | ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికలు దాదాపు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల్లో తమదంటే తమదేనని ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ సరళిని చూసి తన అభిప్రాయం మార్చుకుంటున్నానన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఎన్నికల్లో 150కిపైగా స్థానాలు గెలుస్తామని.. చంద్రబాబు సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ విషయంలోనూ అంచనాలను సవరిస్తున్నానన్నారు.
గత నెల కిందట జనసేన అధినేత పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లానని.. ఆ సమయంలో 50-55వేల మెజారిటీ వస్తుందనుకున్నానన్నారు. ఆయన విషయంలో తన అంచనాలు తప్పేలా ఉన్నాయని.. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు 65వేల మెజారిటీ రావడం ఖాయమన్నారు. పిఠాపురంలోని కొన్ని పోలింగ్ బూత్‌లలో 80శాతం పవన్ కల్యాణ్‌కు అనుకూలంగానే ఓటింగ్ జరిగిందన్నారు. మాజీ సీఎం చంద్రబాబు సైతం కుప్పంలో 60వేలకుపైగా మెజారిటీతో గెలుస్తారన్నారు.
కుప్పంలో బాబును ఓడించేందుకు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు ఇచ్చారని అంటున్నారని.. ఏవరు ఏమిచ్చినా చంద్రబాబు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబుపై కన్నా లక్ష్మీనారాయణ భారీ మెజారిటీతో గెలవబోతున్నారన్నారు. తనకు ఇద్దరూ మంచి స్నేహితులేనని.. తనకు సమాచారం మేరకు ఈ అంచనాలను వెల్లడిస్తున్నానన్ని రాఘురామ చెప్పారు. పశ్చిమ గోదావరిలో వార్ వన్ సైడేనని.. కూటమి క్లీన్ స్వీప్ చేయడం తథ్యమన్నారు. తన అంచనాలు నిజమా? కాదా? అనేది జూన్ 4న తెలుస్తుందని.. అయితే, తన అంచనాలు నిజమవుతాయని నమ్ముతున్నారన్నారు.