టెహ్రాన్: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాన్ దాడుల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రసిద్ధ బుర్జ్ అల్ అరబ్, పామ్ జుమైరా హోటళ్లు దెబ్బతిన్నాయి. ఆదివారం పేలుళ్లతో ఎమిరేట్స్ దద్దరిల్లింది. బహ్రెయిన్‌లోని మనామా నగరంలో క్రౌన్ ప్లాజా హోటల్‌ను ఒక సూసైడ్ డ్రోన్ ధ్వంసం చేసింది. అలాగే ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌పై దాడిలో కొంతమంది పౌరులు మరణించినట్టు సమాచారం. దుబాయ్‌లో పలుచోట్లు పేలుళ్లు సంభవించినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి. పెద్ద పేలుడు శబ్దాలు తమకు కూడా వినిపించినట్టు సౌదీ అరేబియా రాజధాని రియాద్ ప్రజలు తెలిపారు. ఇక ఖతర్ రాజధాని దోహా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్లతోపాటు తొలిసారిగా ఒమన్‌పై కూడా డ్రోన్, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఆస్తులు, స్థావరాలు కలిగి ఉన్న అరబ్ దేశాలన్నింటినీ ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అలాగే సైప్రస్‌లో ఉన్న బ్రిటిష్ మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ రెండు క్షిపణులతో దాడులు చేసింది.
అమెరికా యుద్ధనౌకపై దాడి!
ఖమేనీ హత్యకు ప్రతీకారంగా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధనౌకపై దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. 4 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్టు తెలిపింది. అయితే దీన్ని అమెరికా తోసిపుచ్చింది. గల్ఫ్ నదీ జలాల్లో మోహరించి ఉన్న ఈ నౌకకు సమీపంగా కూడా క్షిపణులు రాలేదని పేర్కొన్నది.