Union Govt : సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్‌లలో డీప్‌ఫేక్ వీడియోలు, బాలలపై లైంగిక వేధింపుల మెటీరియల్ (CSAM) పై ‘మెటా (Meta)’ ప్రతినిధుల బృందంతో కేంద్ర ప్రభుత్వం (Union Govt) చర్చలు జరిపింది. ఇందులో భాగంగా డీప్‌ఫేక్ వీడియోలపై చర్యలు తీసుకోవాలని మెటాను కేంద్రం ఆదేశించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఉండే కంటెంట్‌కు ఆయా సంస్థలే బాధ్యత వహించాలని పేర్కొన్నది. భారత చట్టాలకు అనుగుణంగా మెటా మాధ్యమాలు ఎంత మేరకు నడుచుకుంటున్నాయన్న దానిపై అధికారులు ఆ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు.
ఇన్స్టాగ్రామ్ కంటెంట్ రికమండేషన్ అల్గోరిథమ్‌ల గురించి ఆరా తీశారు. కంపెనీ ప్రతినిధులతో జరిపిన సమావేశాల ఫలితాలను సమీక్షించిన తర్వాత తదుపరి చర్యలపై కార్యాచరణను ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా స్థానిక చట్టాలను పాటిస్తున్నాయా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. చర్చల్లో భాగంగా తమ ప్లాట్‌ఫామ్‌లలోని డీప్‌ఫేక్‌లపై కేంద్రం వ్యక్తంచేసిన ఆందోళనలపై మెటా స్పందించింది. అటువంటి కంటెంట్‌ను నిలిపివేసేందుకు తమ వద్ద పలు పరిష్కారాలు ఉన్నాయని తెలిపింది.
ప్రధాని మోదీ విడుదల చేసిన ఓ వీడియో సందేశాన్ని ఫేస్బుక్ కొన్ని గంటలపాటు నిలిపివేసినందుకు సమన్లు జారీ చేయడంతో దాని మాతృసంస్థ ‘మెటా’ ప్రతినిధుల బృందం భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోని ఇతర కంటెంట్‌పైనా కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. మెటా ప్రపంచ వ్యవహారాల హెడ్ జోయెల్ కప్లన్ నేతృత్వంలోని బృందంతో.. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహా పలువురు అధికారులు చర్చించారు.