భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 08 : పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల కీర్తిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని మిస్ ఆసియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇక్కత్ చేనేత అంబాసిడర్ రష్మీ ఠాకూర్ అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో టూరిస్ట్ అండ్ క్రియేటివ్ ఎకనామి డెవలప్మెంట్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో 40 మంది ప్రతినిధుల బృందం భూదాన్ పోచంపల్లిని సందర్శించింది. టూరిజం పార్క్, భూదానోద్యమం, చేనేత కార్మికుల గృహాలు, చేనేత మగ్గాలు, వస్త్రాల తయారీ, రాట్నం వడకడం, చిటికీ కట్టడం, రంగులు అద్దడం తదితర ప్రక్రియ విధానాలను పరిశీలించారు. గ్రామీణ వాతావరణం, పల్లె సంస్కృతి, చేతి వృత్తులపై అధ్యయనం చేశారు. పోచంపల్లి టూరిజం అభివృద్ధి ఏ విధంగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందించారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా టూరిజం ప్రాంత అభివృద్ధి కోసం కన్సల్టెన్సీ ప్రతినిధులు సాహితీ, శ్రీనివాస్ అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రష్మీ ఠాకూర్ ను నూలు దారం, చేనేత వస్త్రాలతో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, రాష్ట్ర చేనేత నాయకులు తడక రమేష్ శాలువాతో ఘనంగా సత్కరించారు.

తెలంగాణ చేనేతకు కొత్త దారులు : రష్మీ ఠాకూర్
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సెప్టెంబర్ 25న బ్రిటన్ పార్లమెంట్లో పోచంపల్లి చేనేతపై 15 నిమిషాల స్పీచ్ కు అవకాశం దొరికిందని, బ్రిటన్ కు తెలంగాణ రాష్ట్రం నుండి ఒక్కరిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అందరూ పోచంపల్లి అంటే ఓన్లీ శారీస్ మాత్రమే అనుకుంటారని, అది ఓల్డ్ ట్రెడిషన్, ప్రస్తుతం న్యూ ట్రెండ్‌కు తగ్గట్టుగా కోట్లు, బ్లేజర్, ట్రోజర్, ఫర్నిచింగ్, టేబుల్ క్లాత్, సోఫా కవర్స్, కర్టన్స్ ఇంటీరియర్ డెకరేషన్ ఏలా వాడుకోవాలో తెలియజేస్తారన్నారు. విదేశీయులు వేసుకునే వస్త్రాలకు అనుగుణంగా పోచంపల్లి చేనేత వస్త్రాలను రూపొందించాలని, విదేశీ స్కూళ్లలో పిల్లల యూనిఫామ్ కోసం పోచంపల్లి వస్త్రాలను ప్రమోట్ చేయాలని, అందుకు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో పాటు ముందుకు రావాలన్నారు. శారీస్ గురించి చెప్పడం కాదు, ఖాది వస్త్రాలకు పోచంపల్లి చేనేత వస్త్రాలకు తేడా చెప్పాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేన్స్ వేదికపై తెలంగాణ చేనేత ప్రతిష్టాత్మకంగా నిలవడం చేనేత రంగానికి చారిత్రాత్మక ఘట్టంగా మారిందన్నారు. ప్రపంచ మార్కెట్లో పోచంపల్లి ఇక్కత్ కు మరింత గుర్తింపు, డిమాండ్, గౌరవం తీసుకురావడంలో ఈ ప్రదర్శన కీలక పాత్ర పోషించిందని తెలిపారు.ఈ ఘనత ఏ ఒక్కరిది కాదని, పోచంపల్లిలో వందల మగ్గాల ముందు కూర్చుని కష్టపడిన ప్రతి నేతన్న కల ఇది అన్నారు. మన దారం ఇప్పుడు ప్రపంచ దారం అయిందని వెల్లడించారు.

తెలంగాణ చేనేతకు కొత్త దారులు : రష్మీ ఠాకూర్
తెలంగాణ చేనేతను ప్రపంచ లగ్జరీ ఫ్యాషన్ వేదికపై నిలబెట్టడం తన లక్ష్యంగా రష్మి ఠాకూర్ పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మక వేదిక గుర్తింపు పొందిన కేన్స్ ఫెస్టివల్ లో తెలంగాణకు చెందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు తొలిసారిగా మెరిశాయని, గ్రామీణ భారతీయ కళాకారుల ప్రతిభ ప్రపంచాన్ని తాకిందన్నారు. గ్రామీణ మగ్గo నుండి కేన్స్ రెడ్ కార్పేట్ వరకు సాగిన ఈ ప్రయాణం తెలంగాణ చేనేతకు కొత్త దారులు తెరిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌలి శాఖ ఏడీ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ సీఈఓ తడక రమేశ్, పోచంపల్లి చేనేత సహకార సంఘ అధ్యక్షుడు భారత లవ కుమార్, టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, పద్మశాలి చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, వెంకటరమణ సిల్క్ సంఘ అధ్యక్షుడు చింతకింది రమేశ్, అసోసియేషన్ ప్రతినిధులు ఈపూరి ముత్యాలు, కుడికాల రామ నరసింహ, ముస్కూరి నరసింహ, బోడ దయానంద్, నవనీత, గుండు రాజేశ్వరి పాల్గొన్నారు.