Allu Sirish | పండుగలు, వేడుకల సమయంలో శబ్ద కాలుష్యంపై చర్చ జరగడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా డీజేలు, లౌడ్‌స్పీకర్ల వినియోగం, రాత్రివేళల్లో భారీ శబ్దాలపై ప్రతి ఏడాది సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. తాజాగా టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ చేసిన ఓ ఫిర్యాదు కూడా ఇదే అంశంపై చర్చకు దారితీసింది. పండుగ సందర్భంగా రాత్రివేళల్లో అధిక శబ్దంతో లౌడ్స్పీకర్లు వినిపిస్తున్నాయని ఆయన హైదరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అల్లు శిరీష్ షేక్‌పేట్‌లోని అపర్ణ వన్‌లో నివసిస్తున్నట్లు తన సోషల్మ మీడియా పోస్టులో పేర్కొన్నారు. తన నివాసానికి సమీపంలోని వినోభా నగర్ హనుమాన్ దేవాలయం వద్ద కొంతకాలంగా అనుమతించిన పరిమితికి మించి లౌడ్స్పీకర్లలో భారీ శబ్దంతో పాటలు వినిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా రాత్రి 2 నుంచి 3 గంటల వరకు కూడా శబ్దం కొనసాగుతోందని తెలిపారు.
ఈ విషయంపై ఇప్పటికే ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు అల్లు శిరీష్ వెల్లడించారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో సెప్టెంబర్ 25 వరకు సహకరించాలని పోలీసులు కోరారని, అయితే పండుగ ముగిసిన తర్వాత కూడా భారీ శబ్దాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తమ నివాస సముదాయంలోని వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులు ఈ శబ్దాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలోనూ పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని చెబుతూ.. తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను కోరారు.అల్లు శిరీష్ ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు కూడా స్పందించారు. ఈ సమస్యను ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పోస్టుకు రిప్లయ్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో మరింత చర్చకు వచ్చింది.
అయితే అల్లు శిరీష్ చేసిన ఫిర్యాదుపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. శబ్ద కాలుష్యం కారణంగా వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నప్పుడు సమస్యను పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం సరైనదేనని కొందరు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. మరోవైపు పండుగ వేడుకల సమయంలో కొంతకాలం శబ్దాలు ఉంటాయని, వాటిని పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఇక కొందరు నెటిజన్లు మరో అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. నగరంలో ఇతర సందర్భాల్లోనూ శబ్ద కాలుష్యం జరుగుతున్నప్పటికీ.. పండుగల సమయంలోనే కొందరు ప్రముఖులు ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పండుగల సమయంలో ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అదే సమయంలో శబ్ద కాలుష్యానికి సంబంధించిన నిబంధనలు అన్ని సందర్భాల్లోనూ ఒకే విధంగా అమలు చేయాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..
Respected @hydcitypolice . I’m a resident of Aparna One, Shaikpet. For the last few days the Hanuman temple at Vinobha Nagar is playing loud music, beyond allowed decibels till night 2/3am. I complained the Film Nagar PS.
They asked us to bear till 25th Sept as its Ganesh… pic.twitter.com/ggJp4U4hdU
— Allu Sirish (@AlluSirish) September 27, 2026