భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ ధార వేణుగోపాల్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని ఆస్పత్రి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో అదనపు కలెక్టర్ సురక్షితంగా బయటపడ్డారు.
హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వైపు అదనపు కలెక్టర్ వాహనం వెళ్తుండగా.. కామినేని ఫ్లైఓవర్‌పై ముందుగా వెళ్తున్న కంటైనర్ లారీ ఒక్కసారిగా కుడివైపునకు రావడంతో కారు అదుపుతప్పి వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. ఢీకొన్న ధాటికి కారు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో కారు ముందు సీటులో కూర్చున్న అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సీటు బెల్టు ధరించి ఉండటంతో ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి ఎస్సై కృష్ణమూర్తి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను కొత్తగూడెం వైపు పంపించారు. రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.