జగిత్యాల, మార్చి 1(నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లో గత కొన్నేండ్లుగా గడ్డిమందు తాగి పలువురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామస్తులు సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. గడ్డిమందును పూర్తిగా వినియోగించకూడదని ఇటీవల తీర్మానించి, ఆదివారం నుంచి అమల్లోకి తెచ్చారు. చివరకు గ్రామంలో పెండ్లిలు, శుభకార్యాలు జరిగినా, ప్లాస్టిక్ విస్తర్లను, గ్లాసులను వినియోగించవద్దని నిర్ణయించి, ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు.
దుకాణాదారులకు సైతం తెలియజేశారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వినియోగించిన వారి వివరాలు చెబితే వారికి రూ.250 పారితోషికంగా ఇస్తామని ప్రకటించారు. చెర్లపల్లి గ్రామంలోనూ గడ్డి మందును వినియోగాన్ని నిషేధిస్తూ వారం రోజుల కింద తీర్మానించి అమలు చేస్తున్నారు. అతిక్రమిస్తే రూ.500 జరిమానా విధించాలని నిర్ణయించారు.