– కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 12 : భద్రాద్రి కొత్తగూడెం సుజాతనగర్ మండలంలో 14 మంది కూలీలు అస్వస్థకు గురయ్యారు. రెండు రోజుల క్రితం సుజాతనగర్ మండలం కొత్త అంజినాపురంలో నర్రా అజయ్ పంట పొలంలో 20 మంది కూలీలు పనులు చేస్తున్నారు. పనులు చేసే క్రమంలో పొలం యజమాని మొక్కలకు పురుగుమందు స్ప్రే చేశాడు. స్ప్రే చేసిన సమయంలో కలుపు తీస్తుండగా వారికి పురుగుమందు స్ప్రే కండ్లు, ముక్కుల్లో పడడతో ఆ వాసనకు వారు అస్వస్థకు గురయ్యారు. ఇంటికి వెళ్లిన తర్వాత వారికి వాంతులు, విరోచనాలు కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి బుధవారం తీసుకువచ్చారు. ప్రస్తుతం వారంతా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రి వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగతా 12 మంది పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.