Tamil Nadu : పోలీసులు అంటే ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. నేరాన్ని ఆపడానికి, నేరస్తుల్ని అడ్డుకోవడానికి కొందరు పోలీసులు ప్రాణాలు సైతం లెక్కచేయరు. అలా, ప్రాణాలకు తెగించి, క్రిమినల్‌ను పట్టుకున్న పోలీస్ వీరోచిత ఘటన ఇది. ఒక పోలీసు నిందితుడి కార్ రూఫ్ టాప్‌పై వేలాడుతూ 40 కిలోమీటర్లు ఉన్నాడు. అలా, చివరికి నిందితుడిని పట్టుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి.
తమిళనాడు, కోయంబత్తూర్ సమీపంలోని కోవిల్పాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారిపై పోలీసులు సాధారణ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక కారు అనుమానాస్పదంగా కనిపించింది. కారును మొత్తం తనిఖీ చేస్తుండగా కొన్ని నిషేధిత గుట్కా ప్యాకెట్లు కనిపించాయి. దీంతో కారులోని వ్యక్తులు ఆ పోలీసుల్ని తోసేశారు. వేగంగా కారుతో సహా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో హెడ్ కానిస్టేబుల్ వేలుమురుగన్ చెయ్యి కారు డోర్లో ఇరుక్కుపోయింది. కారు వేగంగా బయల్దేరడంతో అప్రమత్తమైన వేలుమురుగన్ వెంటనే కారు రూఫ్ టాప్‌పైకి ఎక్కేశాడు.
Constable Velmurugan of #KovilpalayamPS in #CBE clung to the roof of a car carrying gutkha smugglers after his hand got caught as they fled while checking. He rode for about 30 km along the Kochi-Salem NH before police stopped the chase near Avinashi. @xpresstn @mannar_mannan pic.twitter.com/smaBCxna1x
— 𝐑𝐚.𝐊𝐢𝐫𝐮𝐛𝐚𝐤𝐚𝐫𝐚𝐧 (@kirubakaranR1) September 27, 2026
అతడు కారు పైన ఉండగానే ఆ కారు ఆపకుండా, వేగంగా దూసుకెళ్లింది. అలా, వేలు మురుగన్ కారుపైనే ఉండిపోగా.. ఆ కారు దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించింది. వెంటనే మిగతా పోలీసులు, ఇతర వాహనదారులు ఆ కారును వెంబడించినా ఆగకుండా దూసుకెళ్లారు నిందితులు. ఇలా వెళ్తూ ఒక టోల్ ప్లాజాను కూడా దాటేశారు. అక్కడ ఫాస్టాగ్ కూడా చెల్లించి, వేగంగా వెళ్లిపోయారు. అయితే, సమీపంలోని పోలీసులు, ఇతరులు అలర్ట్ కావడం.. వారంతా కారును చుట్టుముట్టడంతో 40 కిలోమీటర్ల తర్వాత కారును నిందితులు ఆపాల్సి వచ్చింది. ఈ లోపు పోలీసులు అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచారు.
చుట్టుముట్టిన కార్లు, వాహనాల వల్ల తప్పించుకోలేమని అర్థమైన నిందితులు కారును ఆపేశారు. మొత్తం ముగ్గురు నిందితుల్లో ఒకరిని పోలీసులు అక్కడే పట్టుకున్నారు. మరో ఇద్దరు పారిపోగా.. కొంత సమయం వారి కోసం గాలించి, వారిని కూడా అరెస్టు చేశారు. మొత్తం ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. వారి నుంచి 300 కేజీల నిషేధిత గుట్కాతోపాటు కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన హెడ్ కానిస్టేబుల్ వేలు మురుగన్‌ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.