Mani Ratnam | తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘డోరతి’ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమవుతోంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సాధారణ ప్రేమకథగా ఉంటుందని భావించిన ప్రేక్షకులకు భిన్నమైన కథాంశాన్ని పరిచయం చేసింది. ఇద్దరు స్నేహితులు, ఓ యువతి చుట్టూ సాగే కథలో మానవ సంబంధాలతో పాటు ఎల్జీబీటీక్యూఐఏ+ అంశాన్ని కూడా దర్శకుడు స్పృశించడం జరిగింది. విభిన్నమైన కథ, పాత్రల చిత్రీకరణతో తెరకెక్కిన ‘డోరతి’కి అంతర్జాతీయ స్థాయిలోనూ స్పందన లభించింది. ఇటీవల టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
అయితే భారతీయ థియేటర్లలో విడుదలైన తర్వాత మాత్రం కథాంశం, ట్రీట్మెంట్పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘డోరతి’ చిత్రంపై చేసిన ప్రశంసలు ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. చిత్ర బృందం విడుదల చేసిన ఓ ప్రత్యేక వీడియో సందేశంలో మణిరత్నం.. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ప్రతిభను, సినిమా మేకింగ్‌ను ప్రశంసించారు. ప్రస్తుతం ఎంతోమంది యువ దర్శకులు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారని చెప్పిన మణిరత్నం.. వారిలో కార్తీక్ సుబ్బరాజ్ ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన దర్శకుడని పేర్కొన్నారు. ‘డోరతి’ చాలా ప్రత్యేకమైన చిత్రమని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్‌పై మణిరత్నం చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. సినిమా భాష, కెమెరా వినియోగం, దృశ్యాలను తెరకెక్కించిన విధానం తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. కార్తీక్‌కు కెమెరా షాట్లు, సాంకేతిక అంశాలు, దృశ్య భాషపై ఉన్న పట్టును చూస్తుంటే తనకు అసూయగా అనిపిస్తోందంటూ మణిరత్నం సరదాగా వ్యాఖ్యానించారు.అదే సమయంలో ఈ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజాను కూడా మణిరత్నం ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయన సంగీతం ‘డోరతి’కి మరింత బలాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించడం కూడా మరో ప్రత్యేకతగా నిలిచింది. ఇది ఆయన కెరీర్లో 1540వ చిత్రంగా చెప్పబడుతోంది.