చండూరు, ఆగస్టు 12 : చండూరు మున్సిపాలిటీ చౌరస్తాలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్లు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఎండనక, వాననక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, కమిషనర్ మల్లేశంను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చండూరు పట్టణ కేంద్రం నుండి రాకపోకలు కొనసాగించే వారికి బస్ షెల్టర్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అలాగే రద్దీ సమయాల్లో బస్సుల రాకపోకల గురించి సరైన సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూడవలసి వస్తుందన్నారు. చండూరు ప్రధాన చౌరస్తా, వాటర్ ట్యాంక్ సెంటర్ ప్రాంతాల్లో వెంటనే మరుగుదొడ్లతో కూడిన ఆధునిక బస్ షెల్టర్లను నిర్మించాలని, ప్రయాణికులు కూర్చునేందుకు తగినన్ని బెంచీలు ఏర్పాటు చేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఆర్టీసీ బస్సులన్ని నిర్దేశిత కేంద్రాల వద్దే ఆగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎర్రజల్ల లింగయ్య, మొండికతి నరసింహ పాల్గొన్నారు.

‘చండూరు చౌరస్తాలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి’