మామునూరు విమానాశ్రయం పూర్తయి ప్రయాణికులు ఎక్కడమే తరువాయి అన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హడావుడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివరాలు తెలుసుకుంటే ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అసలు మొదటి దశ నిర్మాణ పనులకు ఇంకా కనీసం టెండర్లు కూడా ఖరారు చేయలేదు. టెండర్లు ఖరారయ్యాక 18 నెలల్లో మొదటిదశ పనులు పూర్తవుతాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఎన్నికల నాటికి మొదటి దశ పూర్తి కావాలి. కానీ ఇప్పుడే పేరు పెట్టడంపై ఎందుకు హడావుడి? తామిచ్చిన హామీల అమలుకు నిధులు లేవని చేతులెత్తేశారు. కానీ ప్రజల దృష్టిని మరల్చేందుకు నిధులు అవసరం లేదు కదా. అందుకే సీఎం డైవర్షన్స్పై దృష్టి పెట్టారు.
ఆంధ్ర, తెలంగాణలోనే కాదు దేశంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉన్నదా ? ఉత్తరప్రదేశ్‌లో హడావుడిగా ఏడు విమానాశ్రయాలను ప్రారంభించి, ఆరింటిని మూసేశారు. విమానాల రాకపోకలను నిలిపివేసినట్టు ప్రకటించి, నిర్వహణ భారాన్ని మోస్తున్నారు. విమాన ప్రయాణ వ్యయం భరించలేని ప్రయాణికులు లేక నిలిపివేశారు. మరి కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే విమానాశ్రయాల ఏర్పాటుకు ముందు ఇవన్నీ చూసుకోరా? కన్సల్టెన్సీలకు కోట్లు కట్టబెట్టి అధ్యయనం చేయిస్తారు. మరి యూపీలో మూసివేసిన ఎయిర్‌పోర్ట్స్ విషయంలో కన్సల్టెన్సీలు ఇచ్చిన రిపోర్ట్స్ ఎంత గొప్పగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్ లోని ఖజురహో విమానాశ్రయం లాభసాటి కాదు అని సర్వీస్‌లు నిలిపివేశారు. విచిత్రం ఏందంటే ఇటీవల ఈ విమానాశ్రయానికి దేశంలోనే ఉత్తమ విమానాశ్రయ అవార్డు వచ్చింది. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు లేవు, కానీ పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చారని అవార్డు ఇచ్చారు. అసలు విమానాలు నడపనప్పుడు ఫిర్యాదులు ఉండవు, పర్యావరణ సమస్య కూడా ఉండదు కదా!
గతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం అని హడావుడి చేశారు. సింగపూర్‌కు విమాన సర్వీసులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టాన్ని భరించినంత కాలం సింగపూర్‌కు విమానాలు నడిపారు. ఆ తర్వాత ఆరు నెలలకే సర్వీసులు నిలిపివేశారు. అమెరికాలో 19,482 విమానాశ్రయాలు ఉన్నాయి. అయితే వీటిలో ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగించేవి ఐదు వేల విమానాశ్రయాలే.
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో విమానాశ్రయాల సంఖ్య 164. మన దేశంలో ప్రయాణికుల సంఖ్యకు కొదువలేదు. కానీ విమానాల్లో ప్రయాణించడానికి అవసరమైన ఆర్థిక స్థోమత చాలా మందికి లేదు. కాశీ యాత్ర, ఉత్తరాదిలో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లే తెలుగువారికి అనుభవం ఉంటుంది. రైలు ప్రయాణంలో రిజర్వేషన్లు, ఏ సీట్లు ఎవరివి అనేది పట్టించుకోకుండా ప్రయాణికులు దూరిపోతారు. టాయిలెట్ల వద్ద, డోర్ వద్ద ఒకరి మీద ఇరుకు ఇరుకుగా కూర్చుకుంటారు. రైలులో గౌరవప్రదంగా మనుషుల్లా ప్రయాణించే సౌకర్యం కూడా లేదు. హైదరాబాద్‌కు ఒడిశా, బిహార్ సహా వివిధ రాష్ర్టాల నుంచి కూలీలు వస్తున్నారు. పది వేల జీతం కోసం వస్తున్న వారు కూడా వేల మంది ఉన్నారు. ఇదీ మన దేశ పరిస్థితి. మనకిప్పుడు బుల్లెట్ ట్రైన్స్, విమానాల కన్నా, సాధారణ ప్రజలు ప్రయాణించే రైళ్ల అవసరం ఎక్కువగా ఉన్నది.
మరోవైపు మామునూరు విమానాశ్రయానికి పేరు సూచించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. రాణి రుద్రమదేవి, కాకతీయ, సమ్మక్క-సారలమ్మ, పీవీ నరసింహారావు తదితర పేర్లను పలువురు సూచించారు. వరంగల్ జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు మౌలీ సయ్యద్ అల్లాఉద్దీన్ పేరు పెట్టాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సీఎంకు లేఖ రాశారు. ఇంత హడావుడి నడుస్తున్న ఎయిర్‌పోర్ట్‌కు ప్రతిపాదిత స్థలంలో భూమి మాత్రమే కనిపిస్తుంది తప్ప ఎలాంటి నిర్మాణమూ లేదు. బిడ్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్ 3. నవంబర్ 9న బిడ్లు తెరుస్తారు. మొదటి దశ పనులు 18 నెలల్లో పూర్తి చేయాలి. అంటే అనుకున్నట్టు జరిగితే ప్రస్తుత ప్రభుత్వం గడువు తీరి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండే నాటికి మొదటి దశ పనులు పూర్తి కావాలి. ఉప్పల్ దగ్గర దశాబ్ద కాలం నుంచి సాగుతున్న ఫ్లైఓవర్ పనులు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో ఎంత వేగం ఉంటుందో తెలుస్తుంది.
ఇక మామునూరు విమానాశ్రయం నిర్మాణం రేవంత్‌రెడ్డి హయాంలో మొదలైందేమీ కాదు. 1930లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఇక్కడ విమానాశ్రయం ప్రారంభమైంది. నిజాం రాష్ట్రంలోని కాగితం పరిశ్రమ, వ్యాపారం, రవాణా కోసం దీనిని నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్‌లోని పరిశ్రమలు మూతపడ్డాయి. ఆ తర్వాత దీనిని సైనిక అవసరాలకు ఉపయోగించారు. 1984 వరకు అక్కడ కార్యకలాపాలు సాగేవి. ఆ తర్వాత మూతపడింది. 2018 నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఈ విమానాశ్రయం విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. మామునూరు, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, జక్రాన్‌పల్లి, పాల్వంచ, మహబూబ్‌నగర్‌లో విమానాశ్రయాలకు ప్రతిపాదనలు పంపింది. 2021లో విమానయానశాఖ నుంచి నివేదిక వచ్చింది. మామునూరు విమానాశ్రయం భూసేకరణ కోసం 2021 బడ్జెట్లో రూ.వంద కోట్ల నిధులు కేటాయించారు. హైదరాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండరాదు అనే నిబంధన వల్ల ఇబ్బంది వచ్చింది. ఆ తర్వాత నిబంధన నుంచి మామునూరుకు మినహాయింపు లభించింది. ప్రభుత్వ హడావుడి చూస్తుంటే ‘ఆలూలేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా ఉన్నదని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
-బుద్దా మురళి