Gut Bacteria | మన శరీర ఆరోగ్యంపై పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల ప్రభావం ఎంత ముఖ్యమో ఇటీవలి పరిశోధనలు మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. జీర్ణవ్యవస్థలో ఉండే ఈ బ్యాక్టీరియా సమూహాన్ని గట్ మైక్రోబయోటా అంటారు. ఇవి మన జీవక్రియపై ప్రభావం చూపడమే కాకుండా ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, టైప్-2 మధుమేహం వంటి సమస్యలతో కూడా సంబంధం కలిగి ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. కొంతమంది వ్యక్తుల్లో పేగుల్లో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా ఊబకాయం వచ్చే అవకాశాన్ని పెంచుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తంలో ఉండే కొన్ని అమైనో ఆమ్లాలు ఒకవైపు ఊబకాయంతో, మరోవైపు పేగుల్లోని సూక్ష్మజీవుల కూర్పుతో సంబంధం కలిగి ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. గట్ బ్యాక్టీరియాపై ఇప్పటివరకు జరిగిన అనేక పరిశోధనలు జంతువులపై నిర్వహించినవే. అందువల్ల వాటి ఫలితాలను నేరుగా మనుషులకు వర్తింపజేయలేమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. అలాగే ఒక వ్యక్తికి ఆరోగ్యకరంగా ఉండే పేగు బ్యాక్టీరియా కూర్పు మరొక వ్యక్తికి కూడా అదే విధంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పలేం. అయినప్పటికీ గట్ మైక్రోబయోటా మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుందనే ఆధారాలు క్రమంగా పెరుగుతున్నాయి.
స్వీడన్లోని ల్యాండ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రక్తంలో ఉండే ఏ మెటాబోలైట్లు ఊబకాయంతో సంబంధం కలిగి ఉన్నాయో తెలుసుకునేందుకు అధ్యయనం నిర్వహించారు. అలాగే ఊబకాయంతో సంబంధం ఉన్న ఈ మెటాబోలైట్లు మల నమూనాల్లో కనిపించే పేగు బ్యాక్టీరియా కూర్పుతో ఏమైనా సంబంధం కలిగి ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించారు. ఈ పరిశోధనలో 674 మంది పాల్గొనేవారి రక్త ప్లాస్మా, మల నమూనాలను విశ్లేషించారు. వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)తో సంబంధం ఉన్న 19 రకాల మెటాబోలైట్లను పరిశోధకులు గుర్తించారు. వీటిలో గ్లుటమేట్, అలాగే బ్రాంచ్డ్-చైన్, అరోమాటిక్ అమైనో ఆమ్లాలు (బీసీఏఏ) ఊబకాయంతో అత్యంత బలమైన సంబంధాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఊబకాయంతో సంబంధం ఉన్న ఈ మెటాబోలైట్లు పేగుల్లోని నాలుగు రకాల బ్యాక్టీరియాలతో కూడా సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. వీటిలో బ్లాటియా, డోరియా, రూమినోకాకస్ అనే బ్యాక్టీరియాలు లాక్నోస్పిరేసీ కుటుంబానికి చెందినవి కాగా, ఎస్హెచ్ఏ98 మరో రకమైన బ్యాక్టీరియాగా గుర్తించారు.
బీఎంఐలో కనిపించిన తేడాలకు ప్రధానంగా గ్లుటమేట్, బీసీఏఏ స్థాయిల్లోని వ్యత్యాసాలు కారణమయ్యే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. దీనివల్ల రక్తంలోని మెటాబోలైట్లు, పేగుల్లోని బ్యాక్టీరియా ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయని అర్థమవుతోంది. అవి పూర్తిగా స్వతంత్రంగా పనిచేయవని పరిశోధన సూచించింది. ఈ అధ్యయనంలో ఊబకాయంతో అత్యంత బలమైన సంబంధం కలిగి ఉన్న అంశంగా గ్లుటమేట్ ను గుర్తించారు. గతంలో జరిగిన కొన్ని పరిశోధనలు కూడా గ్లుటమేట్ స్థాయిలకు ఊబకాయానికి మధ్య సంబంధం ఉంటాయని సూచించాయి. అలాగే బీసీసీఏ స్థాయిలను భవిష్యత్తులో టైప్-2 మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాన్ని అంచనా వేయడంలో ఉపయోగించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు పేగుల్లోని బ్యాక్టీరియా కూర్పు, రక్తంలోని మెటాబోలైట్లు, ఊబకాయం మధ్య ఉన్న సంబంధాన్ని మరింతగా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. భవిష్యత్తులో పేగుల్లోని బ్యాక్టీరియా కూర్పును మార్చడం ద్వారా ఊబకాయం, దానికి సంబంధించిన జీవక్రియ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించగలమా అనే అంశంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. అయితే పేగుల్లో ఆరోగ్యకరమైన సాధారణ బ్యాక్టీరియా కూర్పు ఎలా ఉండాలి, దానిపై ప్రభావం చూపే అంశాలు ఏమిటి అనే విషయాలను ముందుగా పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. అందువల్ల గట్ బ్యాక్టీరియా, ఊబకాయం మధ్య సంబంధంపై పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా ఏ ఒక్క బ్యాక్టీరియాను ఊబకాయానికి ప్రత్యక్ష కారణంగా పేర్కొనడం సాధ్యం కాదని నిపుణులు తెలియజేస్తున్నారు.