Mandadi | తమిళ నటుడు సూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల వసూళ్ల మార్కును దాటినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మంట్ సంస్థ తన సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణతో ‘మండాడి’ రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మండాడి’కి తొలి రోజు నుంచే మంచి స్పందన లభించింది. కథ, నటీనటుల పర్ఫార్మెన్స్, తీరప్రాంత జీవనశైలి, సముద్ర నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని చిత్ర బృందం చెబుతోంది.
ముఖ్యంగా సాధారణ కమర్షియల్ కథలకు భిన్నంగా సముద్రంలో జరిగే పడవ పోటీలను ప్రధాన అంశంగా తీసుకోవడంతో పాటు.. తీరప్రాంత ప్రజల జీవన విధానం, వారి సంప్రదాయాలు, భావోద్వేగాలు, పట్టుదల, పోరాటాన్ని కథలో భాగంగా చూపించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. రూ.100 కోట్ల వసూళ్ల మైలురాయిని అందుకున్న సందర్భంగా నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్మంట్ స్పందించింది. ‘మండాడి’ చిత్రానికి ఇది గొప్ప విజయదినమని పేర్కొంటూ.. ఈ ఏడాది విజయవంతమైన చిత్రాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిందని తెలిపింది. అన్ని ప్రాంతాల్లో సినిమా విజయాన్ని అందుకోవడం ప్రేక్షకుల విజయమని నిర్మాతలు పేర్కొన్నారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
‘మండాడి’లో సూరికి జోడీగా మహిమా నంబియార్ నటించింది. సుహాస్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రతి పాత్రకు కథలో ప్రాధాన్యం ఉండేలా దర్శకుడు పాత్రలను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సూరి ఇప్పటికే నటుడిగా విభిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కథానాయకుడిగా ఆయన చేస్తున్న చిత్రాల్లో ‘మండాడి’ ప్రత్యేకంగా నిలిచిందని అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా సముద్రం, పడవ పోటీలు, తీరప్రాంత జీవితం నేపథ్యంలో సాగే కథలో సూరి నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ‘మండాడి’ చిత్రానికి మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. సాధారణంగా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని తీరప్రాంత జీవన ప్రపంచాన్ని కథకు నేపథ్యంగా తీసుకుని.. అక్కడి ప్రజల భావోద్వేగాలు, వారి జీవిత పోరాటాలు, సముద్రంతో వారికి ఉన్న అనుబంధాన్ని దర్శకుడు తెరపై ఆవిష్కరించారు.