Union Govt : కిరాణం దుకాణాల్లో మీరు కొనుగోలు చేసే సబ్బులు (Soaps), సర్ఫులు (Surfs), టూత్ పేస్టులు (Tooth pasts), ఫేస్ క్రీములు (Face creams) మొదలైనవి వెజ్జో, నాన్ వెజ్జో ఇక నుంచి సులువుగా తెలుసుకోవచ్చు. ఆహారపదార్థాలు కాని సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టుల వంటి రోజువారీ వినియోగ వస్తువులపై శాకాహార (Veg), మాంసాహార (Non-Veg) గుర్తులను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీచేసింది.
ఆహార పదార్థాల ప్యాకెట్లపై ఉన్నట్టుగానే ఇకపై ఆహార పదార్థాలు కాని ఉత్పత్తులపైనా ఆకుపచ్చ లేదా ఎరుపు/బ్రౌన్ చుక్కను ముద్రించాల్సి ఉంటుంది. ఈ మేరకు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) నాలుగో సవరణ నిబంధనలు-2026 ను సెప్టెంబర్ 21న నోటిఫై చేసింది. ఈ నిబంధనలు గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచే తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. పూర్తిగా శాకాహార పదార్థాలతో తయారైన ఉత్పత్తుల ప్యాకెట్లపై ఆకుపచ్చ చుక్క (గ్రీన్ డాట్) ముద్రించాలి. అలాగే జంతు సంబంధిత పదార్థాలతో తయారైన నాన్-వెజ్ ఉత్పత్తులపై ఎరుపు లేదా బ్రౌన్ చుక్క (రెడ్/బ్రౌన్ డాట్) తప్పనిసరిగా ఉండాలి.
ఈ గుర్తును ప్యాకెట్ ప్రధాన ప్రదర్శన ప్యానెల్ (ప్రిన్సిపల్ డిస్ప్లే ప్యానెల్) పైభాగంలో వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ముద్రించాలని ప్రభుత్వం ఆదేశించింది. సబ్బు, షాంపూ, టూత్‌పేస్ట్, ఇతర సౌందర్య సాధనాలు, టాయిలెట్రీస్ అన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తువుల్లో ఎలాంటి పదార్థాలు ఉపయోగించారో సులభంగా తెలుసుకునేందుకు ఈ నిబంధన దోహదపడుతుంది.
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. సబ్బులు, క్రీములు వంటి అనేక వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో జంతువుల కొవ్వులు లేదా ఇతర జంతు సంబంధిత పదార్థాలను ఉపయోగిస్తారు. పూర్తి శాకాహారులు లేదా కొన్ని మత, నైతిక విశ్వాసాలు పాటించే వారికి ఇది ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు పూర్తి స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఇలాంటి నిబంధన 2014లోనే ఉన్నప్పటికీ తాజా సవరణ ద్వారా దానిని మరింత పటిష్ఠంచేశారు.
లీగల్ మెట్రాలజీ ఫ్రేమ్‌వర్క్‌లోకి ఈ నిబంధనను తీసుకురావడంతోపాటు గుర్తును ఎక్కడ ముద్రించాలనే దానిపై స్పష్టతఇచ్చారు. ఆహార పరిశ్రమ తరహాలోనే ఇప్పుడు వ్యక్తిగత సంరక్షణ, సౌందర్య సాధనాల రంగంలోనూ పారదర్శకతను పెంచడం ఈ మార్పు ప్రధాన ఉద్దేశం. వినియోగదారులు తమ నమ్మకాలకు, జీవనశైలికి అనుగుణంగా సరైన ఉత్పత్తులను ఎంచుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడనుంది.