Lok Sabha Polling | సిటీబ్యూరో, మే 13, (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకొని తమ బాధ్యతను నెరవేర్చారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా నిక్షిప్తమయ్యాయి. ఓటరు తీర్పు ఎటు వైపు ఉన్నదో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో తేలనున్నది.

అప్పటివరకు అన్ని పార్టీల నాయకుల్లో ఉత్కంఠ తప్పని పరిస్థితి నెలకొన్నది. పోలింగ్ ముగియగానే ఎన్నికల ఏజెంట్లు, అధికారుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీలు చేశారు. వాటిని కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు రాత్రికి రాత్రే తరలించి.. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. లెక్కింపు కేంద్రాల్లోనే స్ట్రాంగ్ రూములు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద్ద మూడంల సాయుధ పోలీసు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు.
ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 11 గంటల వరకు మందకొడిగా సాగగా, మధ్యాహ్నం తర్వాత ఓటర్లు భారీ ఎత్తున పోటెత్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్న వారందరికీ అవకాశం కల్పించగా, కొన్ని చోట్ల రాత్రి 8 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగింది.

విద్యావంతులు అధిక సంఖ్యలో పోలింగ్‌కు దూరంగా ఉండగా..బస్తీ వాసులు భారీగా తరలివచ్చారు. పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఒకటి, రెండు చోట్లా చోటు చేసుకున్న స్వల్ప ఘటనల మినహా గ్రేటర్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకున్నది.