Instagram : సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్స్టాగ్రామ్ తన యూజర్లకు షాకివ్వబోతుంది. ఇప్పటివరకు అందిస్తున్న ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ (E2EE) సపోర్టింగ్ రద్దు చేయబోతుంది. వచ్చే మే 8 నుంచి ఈ2ఈఈ సపోర్ట్ రద్దు చేయబోతున్నట్లు ఇన్‌స్టా మాతృ సంస్థ మెటా వెల్లడించింది. అంటే ఇకపై యూజర్లు చేసే మెసేజ్‌లు ఎంతమాత్రం ప్రైవేట్ కాదు. ప్రైవసీ ఉండదు. యూజర్ల మెసేజ్ చాట్స్‌ను మెటా సంస్థ యాక్సెస్ చేసే వీలుంటుంది.
ఈ2ఈఈ ఫీచర్‌ను మెటా 2023లో ప్రవేశపెట్టింది. దీనివల్ల మెసేజ్ చేసిన వారు, రిసీవ్ చేసుకున్న వారు మాత్రమే వాటిని చదవగలుగుతారు. మధ్యలో ఇతరులకు యాక్సెస్ ఉండదు. కానీ, ఈ ఫీచర్ రద్దు చేస్తే ఆ సంస్థకు మెసేజెస్ చదివే యాక్సెస్ దొరుకుతుంది. కొత్త మార్పు వల్ల ఇబ్బంది కలుగుతుంది అనుకునే యూజర్లు తమ చాట్స్, మెసేజెస్ను ఎలా డౌన్లోడ్, సేవ్ చేసుకోవాలో తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ కొన్ని సూచనలు కూడా చేసింది. వినియోగదారులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని సూచించింది. ఇలా డౌన్లోడ్ చేసుకునే ముందు పాత వెర్షన్ ఇన్స్టాగ్రామ్ వాడుతున్న యూజర్లు కొత్త వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇక ఈ2ఈఈ ఫీచర్‌ను ఇన్స్టాలోనే తొలగిస్తుందా.. లేక ఫేస్బుక్లో కూడా తొలగిస్తుందా అనే విషయంలో సంస్థ నుంచి క్లారిటీ లేదు. అయితే, మెటా సంస్థ ఈ2ఈఈ సపోర్ట్ రద్దు చేయాలనే నిర్ణయం వెనుక ఒక కారణం ఉందని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం ఆన్లైన్లో చైల్డ్ సెక్స్ అబ్యూజ్ మెటీరియల్ (సీఎస్ఏఎం) పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ2ఈఈ వల్ల దీన్ని గుర్తించడం, అడ్డుకోవడం సాధ్యం కావడం లేదు. అందుకే ఈ2ఈఈ తొలగిస్తే అలాంటి అభ్యంతరకర మెసేజెస్ స్కాన్ చేసి, గుర్తించి, తగిన చర్యలు తీసుకునే వీలుంటుంది. వేధింపుల్ని అడ్డుకునే అవకాశం దొరుకుతుంది. సోషల్ మీడియా నుంచి అభ్యంతరకర కంటెంట్ తొలగించాలని అమెరికా, బ్రిటన్ సహా ఈయూ దేశాలు ఆదేశించిన నేపథ్యంలో మెటా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, దీనికి గల కారణాల్ని మెటా అధికారికంగా వెల్లడించలేదు.