డెహ్రాడూన్: బొలెరో వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. మూడేళ్ల చిన్నారితో సహా ఐదుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. ఒక వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు, రెస్క్యూ బృందం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. (Bolero plunges into gorge) ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం దేవ్‌ప్రయాగ్ నుంచి పౌరీ వైపు వెళ్తున్న బొలెరో వాహనం కుంద్ధర్ సమీపంలోని సబ్దర్ఖాల్ వద్ద అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న 250 మీటర్ల లోయలోకి దూసుకెళ్లింది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ వాహనంలో ప్రయాణించిన ఆరుగురిలో ఐదుగురు మరణించినట్లు గుర్తించారు. గాయపడిన ఒక వ్యక్తిని రక్షించారు. హరిద్వార్‌కు చెందిన అర్మాన్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు హరిద్వార్ జిల్లా రాయ్‌పూర్ జీత్పూర్ నివాసితులైన అక్బర్ సూఫీ కుమారుడైన 49 ఏళ్ల అఫ్జల్, ఆయన భార్య 40 ఏళ్ల షబ్బో , మూడేళ్ల కుమార్తె, 14 ఏళ్ల కుమారుడు, అక్బర్ మరో కుమారుడైన 34 ఏళ్ల గుఫ్రాన్‌గా మృతులను పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.