కరకగూడెం, ఆగస్టు 07 : అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు పాలిచ్చే ఆవు బలి అయ్యింది. గ్రామస్తులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. కరకగూడెం మండలంలోని కన్నాయిగూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన వెంకయ్య పాడి ఆవు శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి మేతకు వెళ్లింది. అక్కడే జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో ఆవు చిక్కుకుని ఉచ్చు గొంతుకు బిగుసుకుపోవడంతో అక్కడిక్కడే మృతి చెందింది. అటుగా వెళ్లిన రైతులు గమనించి సదరు రైతుకు సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. మృతి చెందిన పాడి ఆవు విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. అయితే జంతువుల కోసం ఉచ్చులు అమర్చుతున్న వేటగాళ్లపై చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.