కొండాపూర్, మార్చి 14: రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని దేశంలోనే మొదటిసారిగా ముస్లీంలకు తోఫాను అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్ డివిజన్లో శనివారం ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్ రావు బీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ అని, దేశంలోనే మొదటి సారిగా ఇమామ్‌లకు జీతం ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే, శేరిలింగంపల్లి పార్టీ ఇంచార్జీ కృష్ణారావుతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న హరీశ్ రావు.. కేసీఆర్ హఆంలో అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తూ.. ఇమామ్, అర్చకులకు నెల జీతాలు ఇచ్చామని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో కేసీఆర్ దేశంలోనే మొదటిసారిగా తోఫాలను అందించారని, హిందూ, ముస్లీంలను కేసీఆర్ రెండు కండ్లుగా చూశారని గుర్తు చేశారు. రంజాన్ మాసంలో ముస్లీంలు ఉపవాస దీక్షను ఎంతో నిష్టతో చేస్తారని, ఉపవాసం గొప్పదనం వారికి తెలుసని ఆయన అన్నారు. సంపాదించిన దాంట్లో కొంత సొమ్మును దానం చేయడం ఈ మాసం గొప్పదనమని హరీశ్ రావు తెలిపారు.

తెలంగాణలో 204 ప్రత్యేక పాఠశాలలను ముస్లీంలకు ఏర్పాటు చేసిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు. 24 గంటల కరెంట్‌ను ఇచ్చారని, విద్యార్థులకు మెరుగైన విద్యనందించి.. ఒక్కో విద్యార్థి మీద లక్ష రూపాయాలను ఖర్చు చేశారని హరీశ్ గుర్తు చేశారు. గతంలో 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం 4 స్కూళ్లను ప్రారంభిస్తే.. 10 సంవత్సరాలలో 204 స్కూళ్లను ప్రారంభించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని ఎమ్మెల్యే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లీం ఆడపిల్లల పెండ్లికి షాదీ ముబారక్.. కాన్పు సమయంలో రూ.13వేలు, కేసీఆర్ కిట్లు అందజేశామని ఆయన పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు ములాఖత్ అయ్యి సీట్లు పంచుకున్నాయని ఆయన దుయ్యబట్టారు. కొండాపూర్‌లోని ప్రభుత్వ దవఖానను 200ల పడకలకు పెంచితే, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మందులు దొరకడం లేదని హరీశ్ మండిపడ్డారు. బస్తీ దవఖానలకు సుస్తీ పట్టించారని చెప్పారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నికలోస్తే పథకాలు.. లేదంటే ఎత్తేసుడు నడుస్తుందని హరీశ్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1 లక్ష డబుల్ బెడ్రూంలను అందజేస్తే.. హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష ఇండ్లను కూల్చివేసిందని హరీశ్ తెలిపాన్నారు.
రేవంత్ రెడ్డి, యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి ఇద్దరు బుల్డోజర్ల ప్రభుత్వాలను నడుపుతున్నారని హరీశ్ ఫైరయ్యారు. మూసీలో 10వేల ఇండ్లను కూల్చి వేసేందుకు సీఎం సిద్ధమయ్యాడని ఆయన వెల్లడించారు. నగరంలో ఎన్నో ఫ్లైఓవర్లు, రోడ్లను అభివృద్ధి చేశామని.. కొండాపూర్‌లో కరోనా సమయంలో ఫ్లై ఓవర్లను అభివృద్ధి చేశామని హరీశ్ తెలిపారు. గొప్ప పనులను చేసిన కేసీఆర్‌ను రంజాన్ మాసంలో ఆశీర్వదించాలని, పవిత్ర మాసంలో ఇచ్చే ఆశీర్వాదం ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ణు గెలిపిద్దామని హరీశ్ రావు ఇఫ్తార్ విందు సందర్భంగా ముస్లీంలను కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు నియోజకవర్గం ఇంఛార్జీ ఆధర్స్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, నాయకులు రవి యాదవ్, మల్లారెడ్డి, మమత, తదితరులు పాల్గొన్నారు.