కేంద్ర, రాష్ర్టాల కుమ్ములాట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వివిధ రాష్ర్టాల్లోని విపక్ష పాలిత ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం కేసుల పర్వం నడుస్తున్నది. జానపద సినిమాల్లో వలె ‘ఈ బ్రహాస్ర్తాన్ని కాచుకో’ అని ఒకరంటే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వివిధ రాష్ర్టాల్లోని విపక్ష పాలిత ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం కేసుల పర్వం నడుస్తున్నది. జానపద సినిమాల్లో వలె ‘ఈ బ్రహాస్ర్తాన్ని కాచుకో’ అని ఒకరంటే.. ‘నేను సంధించే పాశుపతాస్ర్తాన్ని నువ్వు కాచుకో’ అని మరొకరు అంటున్నారు. కేంద్రం తన అమ్ములపొదిలో ఉన్న ఈడీ, ఐటీ, సీబీఐలను రాష్ట్ర ప్రభుత్వాలపైకి ఎక్కుపెడుతుంటే.. ‘నేనేమీ తక్కువ తిన్నానా’ అంటూ ఏసీబీ, విజిలెన్స్లను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపైకి సంధిస్తున్నాయి. సంయమనం తో సమన్వయపర్చాల్సిన కేంద్రం రాష్ర్టాలపై దాయాదిలా కయ్యానికి కాలుదువ్వడం సమస్యగా మారుతున్నది. దేశంతోపాటు రాష్ట్రాలపైనా తన ఆధిపత్యమే ఉండాలన్న మోదీ సర్కారు మొండి ధోరణి ఈ సమస్యకు మూలమని చెప్పాలి. రాష్ర్టాల్లోని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో జాతీయపార్టీలు ఘోరంగా విఫలమైన తర్వాత ప్రాంతీయ పార్టీలు రం గం మీదకు వచ్చి సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి, గల్లీకి మధ్య ఏర్పడిన అంతరమే ఇందుకు కారణం. దశాబ్దాలుగా జాతీయ పార్టీలు సృష్టించిన శూన్యాన్ని ప్రాంతీయ పార్టీలు భర్తీ చేశాయి.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమాఖ్య విధానం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నది. రాష్ర్టాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిరపరచడం, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్రసంస్థలను ఉసిగొల్పి విపక్ష నేతలను తనవైపు తిప్పుకోజూడటం, రానన్నవారిని వేధించడం తెలిసిందే. దీంతో తప్పనిసరి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆత్మరక్షణకు తమ వద్ద ఉన్న ఆయుధాలనూ బయటకు తీస్తున్నాయి. ఇది చాన్నాళ్లుగానే సాగుతున్నప్పటికీ ఎన్నికలు సమీపించిన వేళ కొంత శ్రుతిమించుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఢిల్లీ-గల్లీ ఘర్షణల్లో పార్టీలకూ, ప్రభుత్వాలకూ మధ్య సన్నని విభజన రేఖ క్రమంగా చెరిగిపోతున్నది. కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీల మధ్య వైషమ్యాలు కాస్తా ప్రభుత్వాల మధ్య యుద్ధంలా మారుతున్నా యి. ఇది అంతిమంగా పరస్పర కేసుల నమోదుకు దారితీస్తుండటం ఓ విపరిణామం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బలాలు, బలగాలు, అధికార పరిధులను రాజ్యాంగం స్పష్టంగానే నిర్దేశించింది. వాటిని ఒకరి మీద మరొకరు మోహరించుకుంటున్నారు. అవసరమైతే ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై ఢిల్లీలో కేసు నమోదైంది. అందుకు ప్రతి గా అమిత్ షా చిన్నారితో ఎన్నికల ప్రచారం చేయించారనే ఆరోపణల పై హైదరాబాద్‌లో కేసు నమోదు చేశారు. ఇవేకాకుండా కర్ణాటక డిప్యూ టీ సీఎం డీకే శివకుమార్‌పై ఢిల్లీ నుంచి ఈడీ కేసులు నడిపితే.. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. బెంగాల్ గవర్నర్ వ్యవహారం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య పొసగని విషయం తెలిసిందే. ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనందబోస్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాంతరంగా మరో ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే ఆరోపణలు, మమతా బెనర్జీ సర్కార్ నిర్ణయాలను అడుగడుగునా అడ్డుకుంటున్నారనే విమర్శలూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఓ మహిళ గవర్నర్ బోస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం దుమారం రేపుతున్నది. చట్టపరమైన పరిమితుల కారణంగా దీనిపై ఎఫ్ఐఆర్ నమో దు చేయనప్పటికీ పోలీసు దర్యాప్తు ప్రారంభం కావడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైషమ్యాలు దీంతో కొత్త మలుపు తిరిగినట్టయింది. ఈ ఉదంతం ఆధారంగా బెంగాల్ మంత్రులు గవర్నర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేయగా.. లంచం ఆరోపణలపై ఈడీ అధికారి అంకిత్ తివారీని ఏకంగా విజిలెన్స్ అధికారులు అరెస్టు చేయ డం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ తరహా దెబ్బకు దెబ్బ అనే రీతిలో జరుగుతున్న కేంద్ర, రాష్ట్ర ఘర్షణల వల్ల దేశంలో అవాంఛనీయ వాతావరణం నెలకొంటున్నది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ప్రవేశం నిరాకరించే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇది దేశానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. మన దేశం భిన్న సంస్కృతులు, భాషలకు నిలయం. అందుకే రాజ్యాంగకర్తలు సమాఖ్య విధానాన్ని మనకు అందించారన్నది అన్ని పార్టీలూ, ముఖ్యంగా బీజేపీ గుర్తుంచుకోవాల్సి న అవసరం ఎంతైనా ఉన్నది.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

