దమ్మక్కా! నేను రాముడిని.. భద్రాచలం కొండమీద తాడిచెట్టు కింద పుట్టలో ఉన్నాను!
జరిగిన కథ: కంచర్ల గోపన్న తండ్రి అస్తమించాడు. పదిహేనేండ్ల వయస్సులో అతని తల్లి మేనమామ కూతురితో వివాహం చేసింది. ఆ సమయానికి కరువు వచ్చింది. ఇక్కట్లపాలైన నేలకొండపల్లి వాసులకు గోపన్న విరివిగా దానధర్మాలు చేశాడు. ఫలితంగా ఆస్తులు కరిగిపోయాయి. అటువంటి కష్టకాలంలో అతనికి గురువైన భట్టరాచార్యులు తారకమంత్రాన్ని ఉపదేశించాడు.
భక్తరామదాసు-5
శ్రీరామనామం మరువాం
భద్రాచలానికి దగ్గర్లో భద్రిరెడ్డిపాలెం అని ఓ చిన్నగ్రామం ఉంది. ఆ గ్రామంలో పోకల దమ్మక్క అనే శబర వనిత ఉంది. పూర్వజన్మలో ఏ పుణ్యం చేసిందో కానీ, ఆమెకు ఓ రోజున శ్రీరాముడు కలలో కనిపించాడట. ‘దమ్మక్కా! నేను.. నీవు నిత్యం ధ్యానించే రాముడిని. భద్రాచలం కొండమీద తాడిచెట్టు కింద పుట్టలో ఉన్నాను. వచ్చి నన్ను దర్శించి సేవించు’ అన్న భద్రవచనాలు వినిపించాయట.
ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది, చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. కలలో మాటలు మాత్రం చెవిలో మారుమోగుతున్నాయి. దమ్మక్క భద్రిరెడ్డిపాలెంలోని ప్రజలకు తన కల గురించి చెప్పింది. కొంతమంది తేలికగా తీసుకున్నారు. నలుగురు మాత్రమే దమ్మక్కతోపాటు భద్రాచలం కొండమీదకు చేరుకున్నారు.
చెట్టు చేమలతో, దట్టంగా అల్లుకున్న తీగలతో, పొదలతో కాలు మోపడానికి వీల్లేకుండా ఉంది భద్రాచలం కొండ. శ్రీరామ నామాన్ని జపిస్తూ వారంతా కొండంతా కలియ తిరిగారు. నడుము వంగిపోయినా, నడక తడబడుతున్నా దమ్మక్క రామదర్శనం కోసం ఓపికగా అంతటా గాలించింది.
ఒకచోట కలలో చెప్పిన గుర్తులు కనిపించాయి. ఒక తాటిచెట్టు కింద పుట్ట ఉంది. అందులో నుంచి గొప్ప వెలుగులు విరజిమ్మడాన్ని దమ్మక్క గమనించింది. పుట్ట రంధ్రాల నుంచి చూస్తే విగ్రహాలు దర్శనమిచ్చాయి. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తనతోపాటు వచ్చిన నలుగురినీ పిలిచి చూపించింది. అప్పటికప్పుడు నలుగురూ గోదావరి నుంచి కడవలతో నీళ్లు మోసి తెచ్చారు. దమ్మక్క ఆ నీళ్లతో పుట్ట కడిగింది. చతుర్భుజ రామరూపం పరిపూర్ణంగా దర్శనమైంది. ఒడిలో సీతాదేవి, పక్కన ధనుర్బాణాలు పట్టుకున్న లక్ష్మణ మూర్తులను చూసి మురిసిపోయింది.
ఆ మూర్తులపైన మళ్లీ నీళ్లు పోసి శుభ్రంగా కడిగింది. పసుపు, కుంకుమ బొట్లు పెట్టింది. కొండమల్లెలతో స్వామికి దండ కట్టింది. తాటిపండ్లనే నైవేద్యంగా సమర్పించింది.
….ఇప్పటివరకూ కథ చెబుతున్న మహమ్మదీయ సాధువు కొద్దిసేపు ఆగాడు. అతను కబీర్ పంథాకు చెందినవాడు. సంచారజీవిగా గతంలో నేలకొండపల్లికి వచ్చినప్పుడు గోపన్నకు పరిచయం అయ్యాడు.
“గోపన్నా! నువ్వెప్పుడూ కలవరించే భద్రాచల రాముడు ఆయనే అయ్యుంటాడయ్యా!” అన్నాడు సాధువు.
“అవును… ఆయనే… ఆ రాముడే… నా రాముడే…” ఆగి ఆగి అంటున్నాడు గోపన్న.
అంటూనే అతని నోటివెంట ఒక పద్యం ధారగా ప్రవహించింది.
శ్రీద సనందనాది మునిసేవితపాద
దిగంతకీర్తిసం
పాద సమస్తభూతపరిపాలవినోద
విషాదవల్లికా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధా
మయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ!
కరుణాపయోనిధీ!

Ram Sita Laxmana
సంపదలనిచ్చేవాడవు… సనకుడు, సనందుడు మొదలైన ఋషుల చేత సేవించబడే పాదాలు కలిగినవాడవు… దిక్కుల చివరి వరకు వ్యాపించిన కీర్తి కలవాడవు… అన్ని ప్రాణులనూ కాపాడడంలోనే సంతోషాన్ని కలిగినవాడవు… జీవుల దుఃఖాలనే తీగలను తెగనరికి వారిని కాపాడేవాడవు… క్షత్రియవంశమనే సముద్రంలో పుట్టిన చంద్రుని వంటివాడవు… నిత్యమూ నృత్య గీతాలతో వినోదించేవాడవు… కరుణా సముద్రుడవు అయిన భద్రగిరి దాశరథీ నీకు నమస్కారం.
…ఇలా గోపన్న పద్యాన్ని పూర్తి చేశాడో లేదో, సాధువు పెద్దగా నవ్వేశాడు.
“ఇంకా ఆ రాముడికి అన్ని వైభోగాలు జరగడం లేదయ్యా! పాపం ఆ దమ్మక్క ఎంతో శ్రమించి తాటాకు పాక వేసింది. ఆ పాకలో కేవలం తాటిపళ్లతోనే రాముడు కడుపు నింపుకొంటున్నాడు అంతే…” అన్నాడు.
“ఏమో… రేపన్నరోజును ఈవేళే ఎవరు చూడొచ్చారు” అన్నాడు గోపన్న.
సాధువు కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు.
“గోపన్నా! ఇకనుంచీ నిన్ను ‘రామదాసూ!’ అని పిలవాలని ఉందయ్యా” అన్నాడు
ఆరాధనగా అతని కళ్లలోకి చూస్తూ.
“ఆ రాముడికి దాసుడిగా ఉండడం కంటే ఈ జన్మకి ఇంకేం కావాలి” అన్నాడు గోపన్న ఆకాశంవైపు తలెత్తి జోడించి.
“నిజమే… మీ తెలుగులో దాసుడంటే సేవకుడని అర్థం. కానీ, మా సంప్రదాయం అది కాదు… దాసు అంటే పండితుడు, జ్ఞాని అని అర్థాలున్నాయి. రామదాసు అంటే రాముడి గురించి తెలిసినవాడు అని. నువ్వు రాముడిని తెలిసినవాడివి. అలా పేరు తెచ్చుకుంటావు కూడా” అంటూ సాధువు అక్కడి నుంచి కదిలాడు.
గోపన్న నేరుగా తన గురువైన రఘునాథ భట్టరు వారిముందు వాలాడు.
“గురుదేవా! మీరు చెప్పినట్లుగా భద్రాచలంలో గుడి బయట పడిందట. ఎవరో ఒక ముసలవ్వ రామ విగ్రహాలను వెలికి తీసి నిత్యపూజలు చేస్తోందట” అని చెప్పాడు.
“మంచి వార్త చెప్పావు నాయనా!” అన్నారు భట్టరు.
“గురుదేవా! తారకమంత్రాన్ని కాశీలో సాధన చేస్తే గొప్ప ఫలితాలను ఇస్తుందంటారు కదా!” ప్రస్తుత సంభాషణకి సంబంధం లేని ప్రశ్న వేశాడు గోపన్న.
“అవును నాయనా! ఎవరైతే అవిముక్త క్షేత్రమైన వారణాసిలో తారకమంత్రాన్ని ఉపాసిస్తారో వాళ్లు భవబంధాల నుంచి విముక్తిని పొందుతారు. ఆ దివ్యమంత్ర ఉపాసన సాధకుడి అపమృత్యు దోషాన్ని తొలగిస్తుంది. బ్రహ్మహత్యాది పాపాల నుంచి విముక్తిని కలిగిస్తుంది. సంసార భయాన్ని నశింపచేస్తుంది. ఆ మంత్రాన్ని ఉపాసించేవాడు ఎక్కడ ఉంటే అది వారణాసి క్షేత్రంతో సమానమవుతుంది. ఆ సాధకుడు అమృతత్త్వాన్ని పొందుతాడు… అని ఉపనిషత్ చెబుతోంది” వివరించారు భట్టరు.
“మీరు గతంలో భద్రాచల క్షేత్ర మాహాత్మ్యాన్ని వర్ణిస్తూ… కాశీకంటే భద్రాచలం వెయ్యిరెట్లు అధిక ఫలితాల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పారు కదా!” మళ్లీ అడిగాడు గోపన్న.
“అయితే ఏమంటావు” అడిగారు భట్టరు.
“ఇప్పుడున్న స్థితిలో ఎలాగూ కాశీకి వెళ్లలేను. కనీసం భద్రాచలానికైనా వెళ్లి, మీరు అనుగ్రహించిన తారకమంత్రాన్ని సాధన చేయాలని ఉంది” తన మనసులోని కోరిక బయటపెట్టాడు గోపన్న.
“గోపన్నా! భక్తికి కూడా కొన్ని హద్దులుండాలయ్యా! ఇప్పటికే నువ్వు మన వైద్యనాథేశ్వర స్వామి ఆలయంలో కొంత సాధన పూర్తి చేశావు. దానికి తగిన ఫలితాన్ని తరుణం వచ్చినప్పుడు స్వామి అనుగ్రహించి తీరుతాడు. ఆ సంగతి అలా ఉంచు. ప్రస్తుతం నీ కుటుంబ పరిస్థితులు ఏమీ బాగోలేవు కదా! మీ నాయనగారిచ్చిన ఆస్తిమొత్తం హారతి కర్పూరం అయిపోయింది. నీవు నేలకొండపల్లెలో హరిదాసుగా మారి జోలెపట్టి నాలుగు వీధులూ తిరుగుతున్నావు. పువ్వులమ్మిన చోటే కట్టెలమ్ముతున్నావని నేను ప్రతిరోజూ బాధపడుతుంటాను. ఈ స్థితిలో భద్రాచలం దాకా ఎలా వెళతావు? ఒక్కడివే అయితే ఎలాగో ఒకలా వెళ్లవచ్చు. నీకు వృద్ధురాలైన తల్లి ఉందని గుర్తులేదా?!” హెచ్చరించారు భట్టరు.
నిజమే… తల్లిని కూడా తనతోపాటు తీసుకువెళ్లాలంటే, తగిన ఏర్పాట్లు లేకుండా సాధ్యం కాదు. ఎలా? ఆలోచనలో పడ్డాడు గోపన్న.
ద్రవ్యం కోసం ఎవరి వద్దనైనా చేయి చాచవలసిందే. కానీ ఎవరిస్తారు?! కొంతమందిని అడిగి చూశాడు. ఫలితం లేకపోయింది.
కొన్ని రోజుల తర్వాత జాగీర్దార్ వద్దకు వెళ్లాడు గోపన్న.
“యాత్ర కోసం సాయం చేయమంటే కాదనకూడదు. కానీ గోపన్నా! నాలో ఒక కోరిక ఉండిపోయింది. నేను కూడా కవిని అనిపించుకోవాలి. ఇది నీ ఒక్కడివల్లే సాధ్యమవుతుంది. నువ్వు ఏదైనా కావ్యం రాసి, నా పేరు మీద ప్రకటించు. అప్పుడు నువ్వు కోరినంత ధనమిస్తాను” మెలిక పెట్టాడు జాగీర్దారు.
అప్పుడు గోపన్న..
“అయ్యా! నేనిప్పటికే జానకీపతి శతకం రాశాను. నా పాటలు విన్నంతగా జనం ఆ పద్యాలు వినలేదు. మీకు అంగీకారమైతే ఆ శతకాన్ని మీపేరు మీద ప్రకటిస్తాను” అని ప్రతిపాదించాడు.
జాగీర్దార్ అందుకు సమ్మతించాడు. జానకీపతి శతకాన్ని వెలకు కొనుక్కున్నాడు. అలా గోపన్న రచనలలో ఒక రచన అతనిది కాకుండాపోయింది. కానీ, ఆ కొనుక్కున్న వాడి ఊరూ పేరూ కూడా తర్వాతి కాలం వారికి తెలియకుండా పోవడం ఒక విచిత్రమైన సంగతి.
దానికంటే దురదృష్టకరమైన సంగతి ఏమిటంటే… తన కావ్యాన్ని అమ్ముకుని, డబ్బు చేతపట్టుకుని గోపన్న ఇల్లు చేరుకునే సమయానికి… తల్లి అయిన కామాంబ మరణించింది. అలా తీర్థయాత్రకోసం తెచ్చుకున్న సొమ్ము ఆమె అంతిమయాత్ర కోసం వినియోగపడింది.
అక్కగారి మరణవార్త విని కూడా హైదరాబాదు వదిలి రావడానికి అక్కన్న, మాదన్నలకు వీల్లేకుండా పోయింది. విస్సన్న, మురహరి మాత్రం వచ్చారు. కర్మకాండలు పూర్తయ్యే వరకు నేలకొండపల్లిలో ఉన్నారు.
“గోపన్నా! నువ్వు ఒక్కడివీ ఈ పల్లెటూళ్లో ఏం చేస్తావు?! మాతో పాటు హైదరాబాదుకు వచ్చేయ్. మనవాళ్లంతా అక్కడే ఉన్నారు. నీ అన్నలైన లింగన్నకు, ఎంగన్నకు కూడా మాదన్న మావయ్య మంచి ఉద్యోగాలిప్పించాడు. నీకు కూడా ఏదో ఒక ఉపాధి దొరక్కపోదు” అన్నాడు గోపన్నకు పిల్లనిచ్చిన మామ అయిన విస్సన్న.
మామ మాట తీసేయలేక పోయాడు గోపన్న. ఏటిసూతకం గడిచేవరకూ ఎలాగూ తీర్థయాత్రలు చేయడానికి వీల్లేదు. కనుక, భద్రాచలం వెళ్లాలన్న తన మనసులోని కోరికను వాయిదా వేసుకున్నాడు.
నేలకొండపల్లి నుంచి వెళ్లిపోతూ తల్లిపేరు చెప్పి తన ఇంటిని జొన్నాభట్ల సీతారామయ్య అనే పండితుడికి దానమిచ్చాడు.
గురువు తనంతట తానే వచ్చి గోపన్నకు వీడ్కోలు చెబుతూ..
“గోపన్నా! హైదరాబాదు అలవాట్లు మంచివి కావు. స్త్రీ పురుష భేదం లేకుండా తారీ (కల్లు) పుచ్చుకుంటారట. పొగాకు లంచంగా ఇస్తే రాజ్యంలో ఎంత పెద్ద పనైనా చిటికెలో పూర్తవుతుందట. చిన్నపిల్లాడివి… నువ్వు అటువంటి అలవాట్లకు లోనుకాకు సుమా!” అని హెచ్చరించాడు.
“అలాగే గురువు గారూ!” అంటూ గోపన్న తన మామలతో కలిసి హైదరాబాదు ప్రయాణమయ్యాడు. దారి పొడవునా అతని నోటివెంట ఒకే కీర్తన నర్తించింది.
శ్రీరామనామం మరువాం మరువాం
సిద్ధము యమునకు వెరువాం వెరువాం
…ఏవేళలో అయినా గోవిందుడినే కొలుస్తాం. దేవుని గుణాలనే తలుస్తాం. విష్ణు కథలనే చెవులతో విందాం. వేరే కథలంటే మా చెవులు మందమని చెబుదాం…. అని చరణాలలో చెబుతూ…
రామదాసులు మాకు సారాం సారాం
కామదాసులు మాకు దూరాం దూరాం
….అని పలికాడు గోపన్న. నారాయణుని మేము నమ్ముకున్నాం. చెడుగుణాలు కలిగిన నరులను మేము నమ్మమని కూడా వెల్లడించాడు. మాధవ నామం మరువం, యమబాధకు వెరువం… అని పలికాడు.
సుదీర్ఘమైన చాలానే చరణాలున్నాయి. ప్రయాణంలో ఒక్కటొక్కటిగా రెండేసి పాదాలు కలిగిన చరణాలెన్నో గోపన్న నోటివెంట వచ్చాయి.
చివరి రెండు చరణాల్లో… అవనిజపతి సేవ మానకుండా చేస్తాం…. వేరొక్క జోలంటే మౌనం వహిస్తాం… అని చెబుతూ భద్రాచల రామాంకితంగా భద్రగిరీశుని కందాం కందాం… భద్రముతో మనముందాం ఉందాం… అని పాడాడు.
అప్పటి వరకూ ఆ కీర్తనను ఆసక్తికరంగా వింటున్న మురహరి అడిగాడు.
“ఈ భద్రగిరీశుడెవరు గోపన్నా?!” అని.
అప్పుడు గోపన్న అతనికి భద్రాచల క్షేత్ర మాహాత్మ్యాన్ని వివరిస్తూ..
“మొన్న ఈ మధ్యనే భద్రాచలంలో రామ విగ్రహాలు బయటపడ్డాయి మావయ్యా!” అని ఉత్సాహంగా చెప్పాడు.
“బాగానే ఉంది. రాచకొలువులో ప్రవేశించబోతున్నావు. కాస్త ఈ పిచ్చి తగ్గించుకో. పాటలు పక్కన పెట్టి, బుద్ధిగా పని నేర్చుకో. ప్రయోజకుడివి అవుతావు” అని సుద్దులు చెప్పాడు మేనమామ. ఇంతలో అనేక ఉద్యానవనాలతో పచ్చపచ్చగా అలరారుతున్న హైదరాబాదు నగరం రానే వచ్చింది. అల్లంత దూరానికి ఎత్తుగా, ఠీవిగా చార్మినార్ కనిపిస్తోంది.
(వచ్చేవారం… తారుమారైన స్థితిగతులు)
– నేతి సూర్యనారాయణ శర్మ, 99517 48340
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దమ్మక్కా! నేను రాముడిని.. భద్రాచలం కొండమీద తాడిచెట్టు కింద పుట్టలో ఉన్నాను!
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి టీఎస్ సీపీఎస్ ఈయూ
కొలీజియం సిఫార్సు ఒకరికి.. కేంద్రం నియామకం మరొకరికి!
ఐదు కొత్త రకాల సూక్ష్మ కప్పల జాతుల గుర్తింపు.. తొలిసారిగా గర్భస్థ శిశువుకు ‘ఓపెన్ ఫీటల్ సర్జరీ’
ఐపీవోకి దక్కన్ సౌండ్ స్కూప్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

