ముంబై: అమెరికాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు .. హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ను వైస్ కెప్టెన్ పాత్రలో ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఆడుతున్న హార్దిక్ విషయంలో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ విముఖతతో ఉన్నట్లు తెలిసింది. ఓ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. బీసీసీఐకి కానీ, రోహిత్‌కు కానీ.. హార్దిక్‌ను టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలన్న ఉద్దేశం లేదని తెలిసింది. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న హార్దిక్ ఈ సీజన్లో పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయాడు. 13 మ్యాచుల్లో అతను 144 స్ట్రయిక్ రేటుతో 200 రన్స్ చేశాడు. 11 వికెట్లు కూడా తీసుకున్నాడు. అయితే వత్తిడిలోనే హార్దిక్ పాండ్యాను టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసినట్లు మీడియా రిపోర్టు పేర్కొన్నది. ఇక టీ20 వరల్డ్‌కప్ తర్వాత రోహిత్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు కూడా వెల్లడించింది. ఫామ్‌లో లేకున్నా హార్దిక్‌ను ఎందుకు ఎంపిక చేశారన్న ప్రశ్నలకు ఓ మీడియా సమావేశంలో అగార్కర్ సమాధానం ఇస్తూ.. హార్దిక్ లాంటి ట్యాలెంట్ ఆటగాడి స్థానంలో మరో ప్లేయర్‌ను తీసుకునే ఛాన్స్ సెలక్షన్ కమిటీకి దక్కలేదని పేర్కొన్నారు.