Inflammation | సాధారణంగా శరీరంలో ఎక్కడైనా వాపు వస్తే దానిని కొందరు అంతగా పట్టించుకోరు. చిన్న సమస్యగా దానిని భావిస్తారు. నిలబడి ఉండడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం లేదా అలసట వల్ల వచ్చిందని అనుకుంటారు. కానీ కొన్ని భాగాల్లో తరచూ లేదా నిరంతరంగా వాపు కనిపిస్తే అస్సలు తేలికగా తీసుకోకూడదు. ఇది అంతర్గత ఆరోగ్య సమస్యను సూచిస్తుందని భావించాలి. ఇలా వాపు ద్వారా సమస్యలను తెలియజేసే వాటిల్లో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి కూడా ఒకటి. కిడ్నీలు సరిగ్గా పని చేయకపోవడం వల్ల శరీరంలో ఉన్న అదనపు ద్రవాలు, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లవు. దీంతో శరీరంలో ద్రవం పేరుకుపోయి వాపు కనిపిస్తుంది. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా త్వరగా చికిత్స తీసుకునే వీలు ఉంటుంది. సాధారణంగా ఆరోగ్యకరమైన కిడ్నీలు రక్తంలో ఉన్న వ్యర్థాలు, అదనపు ద్రవాన్ని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. కానీ కిడ్నీల పనితీరు తగ్గితే శరీరంలోని కొన్ని భాగాల్లో ద్రవం చేరుతుంది. ఈ పరిస్థితిని వైద్యపరంగా ఎడిమా అంటారు. ఈ సమస్య సాధారణంగా నెమ్మదిగా ప్రారంభమై కాలక్రమేణా పెరుగుతుంది. దీంతో పాటు కిడ్నీ వ్యాధి వల్ల మూత్రం ద్వారా ప్రోటీన్ బయటకు పోతుంది.
రక్తంలో ప్రోటీన్ తగ్గితే కూడా వాపు మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా ఉదయం సమయంలో కళ్ల చుట్టూ వాపు లేదా కళ్లు ఉబ్బినట్టుగా కనిపిస్తే అది కొన్ని సందర్భాల్లో కిడ్నీ సమస్యకు సంకేతం కావచ్చు. కిడ్నీ దెబ్బతినడంతో మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతుంది. దీంతో ద్రవ సమతుల్యత మారి కంటి పైపొరల వంటి సున్నితమైన కణజాలాల్లో ద్రవం చేరుతుంది. దీంతో విశ్రాంతి తీసుకున్నప్పటికీ కళ్ల చుట్టూ వాపు అలాగే కనిపించవచ్చు. అలాగే కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు అదనపు ద్రవం పాదాలు, మడమల వద్ద ఎక్కువగా చేరుతుంది. ఇది గురుత్వాకర్షణ కారణంగా శరీరంలోని దిగువ భాగాల్లో నిల్వ అవుతుంది. దీనివల్ల షూస్ గట్టిగా అనిపించడం, సాక్స్ గుర్తులు పడటం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
అదే విధంగా ద్రవాలు నిల్వ ఉండడం వల్ల చేతులు, వేళ్లల్లో కూడా వాపు వస్తుంది. దీంతో ఉంగరాలు అకస్మాత్తుగా గట్టిగా అనిపించడం, వేళ్లు ఉబ్బినట్టుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వాపు ఎక్కువగా ఉదయం లేదా ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారం తిన్న తర్వాత గమనించవచ్చు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ద్రవం పొత్తికడుపులో కూడా చేరవచ్చు. దీంతో పొట్ట ఉబ్బినట్టు కనిపించడం లేదా పొట్టలో అసౌకర్యంగా ఉండడం జరుగుతుంది. ఈ పరిస్థితిని అసైటిస్ అంటారు. ఇది తీవ్రమైన కిడ్నీ సమస్యలతో పాటు శరీరంలోని ద్రవ సమతుల్యతను ప్రభావితం చేసే ఇతర వ్యాధులతో కూడా సంబంధం ఉండవచ్చు. కిడ్నీ సమస్యలతో బాధపడే వారిలో వాపుతో పాటు ఇతర సమస్యలు కూడా కనిపిస్తాయి. అలసట, మూత్రం పరిమాణం తగ్గడం, నురుగుతో కూడిన మాత్రం రావడం, వాంతులు, మలబద్దకం, కండరాల తిమ్మిర్లు, దురద వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి.
హై బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్ కిడ్నీ వ్యాధికి ప్రధాన ప్రమాద కారకాలని వైద్యులు చెబుతున్నారు. ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవవు. కానీ మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు తరచూ చేయించుకోవడం వల్ల సమస్యను ముందుగా గుర్తించే వీలు ఉంటుంది. దీంతో చికిత్స కూడా సులభతరం అవుతుంది. అయితే వాపు తరచూ రావడం, వాపు రోజురోజుకూ పెరగడం, అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.