మాగనూరు : నారాయణపేట జిల్లా కృష్ణ మండలం పరిధిలోని కృష్ణా నదిలో నిత్యం రాత్రి వేళలో అక్రమ ఇసుక రవాణా (Sand Illegal Transport) అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. బుడ్డ బల్లూరి శివారులో ఉన్న ఓంకార మఠం, వాసు నగర్, ముడుమాల్, గురుజాల్, గ్రామాల సమీపం నుంచి భారీ సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా నదిలో రోడ్లు వేసి హిటాచీల ద్వారా ట్రిప్పర్లలో ఇసుక నింపి కర్ణాటకలోని సైదాపూర్, యాదగిరి, గుల్బర్గాకు ఇసుకను అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులకు ముడుపులు ముట్టడం వల్లే పట్టించుకోవడం లేదని ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం రాత్రి ముడుమాల్ కృష్ణా నదిలో అక్రమ ఇసుక రవాణాపై కృష్ణ ఎస్సై సిబ్బందితో దాడులు నిర్వహించి మూడు ట్రాక్టర్లను పట్టుకుని, టిప్పర్లను వదిలేశారని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఎస్సై నవీద్ ను వివరణ కోరగా క్వారీ ప్రాంతాల్లో ట్రిప్పర్లు ఏమి లేవని, నాలుగు ట్రాక్టర్లు మాత్రమే దొరికాయని, ట్రాక్టర్ల నెంబర్ల ఆధారంగా కేసులు నమోదు చేశామని వివరించారు.