మాస్కో: కొన్ని రోజుల క్రితం అయిదోసారి రష్యా దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి సెర్గీ షోయిగును ఆ పదవి నుంచి తొలగించారు. 68 ఏళ్ల షోయిగు 2012 నుంచి రక్షణ మంత్రిగా చేశారు. అయితే ప్రస్తుతం ఆయన్ను రష్యా సెక్యూర్టీ కౌన్సిల్ సెక్రటరీగా నియమించనున్నారు. షోయిగు స్థానంలో డిప్యూటీ ప్రధాని ఆండ్రే బెలసోవ్ను రక్షణ మంత్రిగా నియమిస్తున్న రష్యా పార్లమెంట్ పేర్కొన్నది. రక్షణ మంత్రి ఇన్నోవేటివ్‌గా ఉండాలని క్రెమ్లిన్ అభిప్రాయపడింది. శక్తివంతమైన సెక్యూర్టీ కౌన్సిల్ కీలక పదవిలో నిఖోలోయ్ పత్రుసేవ్ ఉన్నారు. అయితే ఆయన్ను ఆ స్థానం నుంచి తొలగించిన షోయిగును నియమించాలని పుతిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పత్రుసేవ్కు ఏ పదవి ఇస్తారో ఇంకా స్పష్టంగా తెలియదు.
రక్షణ మంత్రి షోయిగు, పుతిన్ ఒకప్పుడు సైబీరియాలో ఫిషింగ్‌కు వెళ్లేవాళ్లు. అయితే ఎటువంటి మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్ లేని షోయిగుకు రక్షణ మంత్రి బాధ్యతలను అప్పగించారు. ప్రొఫెషనల్‌గా ఆయన సివిల్ ఇంజినీర్. 1990 దశకంలో ఆయన ఎమర్జెన్సీ, డిజాస్టర్ శాఖ మంత్రిగా చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తర్వాత రక్షణ మంత్రిగా షోయిగు పూర్తి స్థాయిలో బాధ్యతల్ని నిర్వర్తించారు.