న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో న్యూస్ చానళ్లకు నాలుగు వారాల పాటు టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(టీఆర్పీ) నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలకు సంబంధించి సంచలనాత్మక, కల్పిత రిపోర్టింగ్పై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ ఆదేశాలు జారీచేస్తూ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించే వార్తా కథనాలను అనేక న్యూస్ చానళ్లు ప్రసారం చేస్తున్నట్లు తాము గమనించామని పేర్కొన్నది.
యుద్ధ ప్రభావిత ప్రాంతాలతో సంబంధం ఉన్న తమ బంధువులు, స్నేహితులు లేదా వృత్తిపరమైన సంబంధాలు ఉన్న వ్యక్తులకు ఇటువంటి సంచలనాత్మక, ఊహాజనిత కథనాలు ఆందోళన కలిగించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొన్నది. సున్నితమైన అంతర్జాతీయ పరిణామాలు సంభవిస్తున్న కాలంలో బాధ్యతారహిత రిపోర్టింగ్ వీక్షకుల్లో ఆందోళన కలిగిస్తుందని తెలిపింది.