EPFO | ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు ఆయా సంస్థలు, కంపెనీలు పీఎఫ్ సౌకర్యం కల్పిస్తాయి. ప్రతినెలా ఉద్యోగి వేతనం నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంటాయి. సదరు ఉద్యోగి భవిష్యత్ అవసరాలకు ఈ డబ్బు బాగా ఉపయోగ పడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల భవిష్యత్ కోసం కేంద్ర ప్రభుత్వం ‘ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ (ఈపీఎఫ్)’ పథకం అమలు చేస్తున్నది. ప్రతీ పీఎఫ్ ఖాతాదారుడికి ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఉంటుంది.
ఈపీఎఫ్ ఖాతా ఆధారంగా ప్రతి ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్ ఉచితంగా రూ.7 లక్షల వరకూ పొందే వెసులుబాటు కల్పించింది ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ). ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం కింద ఈ బెనిఫిట్లు పొందొచ్చు. పీఎఫ్ ఖాతాదారులంతా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం ఖాతాదారులే. ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణించడానికి ముందు 12 నెలల్లో ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో పని చేస్తూ ‘సర్వీస్’లో ఉంటూ మరణించినట్లైతే, వారి కుటుంబ సభ్యులకూ బీమా ప్రయోజనం కల్పించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకున్నది.
ఈ స్కీం ద్వారా ఈపీఎఫ్ ఖాతాదారులు రూ.2.5-7 లక్షల వరకూ ఉచితంగా బీమా సౌకర్యం పొందొచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగా మరణిస్తే కుటుంబ సభ్యులకూ గానీ, నామినీకి గానీ ఈ బీమా సౌకర్యం లభిస్తుంది. ఈ పథకం కింద బెనిఫిట్లు పొందాలంటే ముందు ఈ-నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినీ వివరాలు ఈపీఎఫ్ ఖాతాలో నమోదు చేయాలి. కనీస వేతనం రూ.15 వేల లోపు ఉన్న వారందరికీ ఈడీఎల్ఐ స్కీం వర్తిస్తుంది. కనీస వేతనం రూ.15 వేలు దాటిన వారికి గరిష్టంగా రూ.7 లక్షల వరకూ బీమా కవరేజీ లభిస్తుంది.