Actor Vishal | సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దక్షిణాది సినీ పరిశ్రమలో పెను సంచలనంగా మారాయి. ‘కత్తి కాంతారావు జాతీయ అవార్డు’ ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన కాంతారావు గొప్పతనాన్ని కొనియాడే క్రమంలో తమిళ చిత్ర పరిశ్రమ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ (MGR) పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంతారావు పేరు చెబితేనే ఎంజీఆర్ భయపడేవారని, ఆ సమయంలో ఆయన ప్రవర్తనను ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ వాడిన పదజాలం వివాదాస్పదంగా మారాయి.
అయితే ఈ వ్యాఖ్యలపై నటుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి గౌరవనీయమైన సీనియర్ నటుడు, కోట్లాది మంది ఆరాధ్య దైవమైన ఎంజీఆర్ గారిని అంత తక్కువ చేసి మాట్లాడటం తనను షాక్‌కు గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహానుభావుడిని పొగిడేందుకు మరొక మహానుభావుడిని కించపరచడం సరైన పద్ధతి కాదని విశాల్ హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు తమిళ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని, దీనిపై రాజేంద్ర ప్రసాద్ వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కూడా పలువురు నటులపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీసిన నేపథ్యంలో, తాజా ఘటన సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడులో కూడా ఈ అంశంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.