Donald Trump : అగ్రరాజ్యం అమెరికా విమానాలు (USA flights), హెలికాప్టర్ల (Helicopters) కు తలనొప్పిగా మారుతున్న కొన్ని ఆయుధాలను చైనా (China) నుంచి ఇరాన్ (Iran) కు సరఫరా చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. వీటి రవాణాకు పాకిస్థాన్ (Pakistan) ను మార్గంగా ఎంచుకున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ సంచలన కథనం ప్రచురించింది. దాంతో అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. పాకిస్థాన్ పేరు ఎత్తకుండా చైనాపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
చైనా నుంచి దాదాపు 60 మిలియన్ డాలర్లకుపైగా విలువైన 400 షోల్డర్‌ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. వాటితో తమ గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరాన్ భావిస్తోంది. అయితే ఈ డీల్‌కు టెహ్రాన్ పక్షాన హాంకాంగ్ చెందిన ఝాంగ్కింగ్ బావోషాంగ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మధ్యవర్తిగా ఉంది. ఈ క్షిపణులను ఉత్తర చైనా నుంచి పాకిస్థాన్ మీదుగా ఇరాన్‌లోకి చేర్చాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కాకపోతే వీటిని భూమార్గంలో తరలిస్తారా..? గగనతలంలో తీసుకెళతారా అనే అంశంపై స్పష్టతలేదు. అయితే ఈ కథనాలను చైనా కొట్టిపారేసింది.
ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంశంపై స్పందించారు. చైనా ఆయుధాల సరఫరా విషయం తెలుసుకొని తాను నిరాశకు గురైనట్లు పేర్కొన్నారు. తాము ఇరాన్‌కు ఆయుధాలు విక్రయించబోమని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్వయంగా తనకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. చైనా, రష్యాల నుంచి ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయవద్దని గత వారం ట్రంప్ హెచ్చరికలు కూడా చేశారు.