National Flag Controversy | టీ20 ప్రపంచకప్ 2026 గ్రాండ్ విక్టరీ తర్వాత సంబరాల్లో మునిగిపోయిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు చట్టపరమైన సమస్యలను చిక్కుకున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ జట్టు మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన వేళ మైదానంలో హార్దిక్ చేసిన కొన్ని పనులు ఈ వివాదానికి దారితీశాయి. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా తన భుజాలపై జాతీయ జెండాను చుట్టుకుని మైదానమంతా పరుగెత్తుతూ సందడి చేశారు. అయితే ఆ తర్వాత తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి పోడియంపై పడుకుని వేడుకలు చేసుకున్న సమయంలో కూడా జాతీయ జెండాను శరీరంపైనే ఉంచుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ విషయంపై పుణేకు చెందిన న్యాయవాది వాజిద్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుణేలోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఆయన సమర్పించిన ఫిర్యాదులో 1971 జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం (Prevention of Insults to National Honour Act) కింద హార్దిక్ ప్రవర్తన జాతీయ పతాకాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. జెండాను ఒంటికి చుట్టుకుని పడుకోవడం, ఆ స్థితిలో అసభ్యంగా ప్రవర్తించడం మువ్వన్నెల జెండా గౌరవాన్ని తగ్గించేలా ఉందని వాజిద్ తన పిటిషన్లో ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదుపై పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ ఘటనపై మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు పాండ్యాకు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు దేశానికి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు జాతీయ చిహ్నాల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.