పిల్లలు మాట విననప్పుడు, తప్పు చేసినప్పుడు పెద్దలు గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇది పిల్లల అభివృద్ధిలో దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం చూపుతుందట. అయ్యిందానికీ, కానిదానికీ బిగ్గరగా అరవడం వల్ల పిల్లల్లో ఒత్తిడి స్థాయులు అమాంతం పెరిగిపోతాయట. వారిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. పెద్దలు నిరంతరం అరుస్తూ ఉండటం వల్ల పిల్లలు తమ భావాలను ఎలా వ్యక్తీకరించాలో తెలియక తల్లడిల్లుతారు.
దీంతో ఒక్కసారిగా తమ భావోద్వేగాలను వారు బయటపెట్టేస్తారు. అంతేకాదు పిల్లల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా లోపిస్తాయి. దురుసు స్వభావం పెరుగుతుంది. మెదడు అభివృద్ధిపైనా దుష్ప్రభావం పడుతుంది. కుటుంబసభ్యులు తమమీద అరవడం కారణంగా పిల్లలు పెద్దలపట్ల తిరస్కార భావం అలవర్చుకుంటారు. అలా సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి, పిల్లలతో సౌమ్యంగా, ప్రశాంతంగా మెలగాలి అంటున్నారు నిపుణులు.
మనల్ని ఏది ఆనందంగా ఉంచుతుందనే దానిపై ఎన్నో అపోహలు ఉంటాయి. అయితే ఆనందం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. అది ఒక స్థితి. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జాగరూకత, ఇతరులతో సత్సంబంధాలు ఏర్పర్చుకోవడం, ప్రతిరోజు చిన్నచిన్న లక్ష్యాలను సాధించడం, ఎదుటివారి పట్ల దయతో మెలగడం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం మనల్ని ఎప్పటికప్పుడు ఆనందంగా ఉంచుతాయని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే తగినన్ని నీళ్లు తాగాలనే విషయం తెలిసిందే. అయితే నీళ్లు మోతాదుకు మించి తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు వైద్యులు. నీళ్లు మితిమీరి తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ ఏర్పడుతుంది. ఇది గుండె సమస్యలకు కారణమవుతుంది. రెండున్నర లీటర్ల నుంచి నాలుగు లీటర్ల వరకు ఫర్వాలేదు కానీ, అంతకుమించొద్దని సూచిస్తున్నారు.
వేడి వాతావరణంలో శరీర శ్రమ చేసేవాళ్లు మూడు నుంచి మూడున్నర లీటర్ల నీళ్లు తాగొచ్చట. అదే గుండె వైఫల్యం, కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్లు మాత్రం ఒకటిన్నర లీటర్ల వరకు పరిమితం చేసుకోవాలట. ఇంకోమాట శరీర బరువు నీళ్లు తాగే నిష్పత్తిని 0.03 రెట్లు ఉండేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అంటే 70 కిలోల బరువుండే వ్యక్తి 2.1 లీటర్ల నీళ్లు తీసుకోవాలన్నమాట! ఈ లెక్కలు అలా ఉంచితే అన్నిటికీ మించి దాహం వేయడమే నీళ్లు తాగడానికి సంకేతంగా భావించాలి. అంతేతప్ప అదేపనిగా నీళ్లు మాత్రం తాగేయవద్దు.