Bill Gates : ఎప్స్టీన్ ఫైల్స్‌లో తన పేరు ఉండటంపై మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, సంపన్నుడు బిల్‌గేట్స్ స్పందించాడు. తన బిల్‌గేట్స్ ఫౌండేషన్ స్టాఫ్‌కు క్షమాపణలు చెప్పాడు. ఇటీవల టౌన్‌హాల్ మీటింగ్‌లో తన ఫౌండేషన్ స్టాఫ్‌తో జరిగిన అంతర్గత సమావేశంలో బిల్‌గేట్స్ మాట్లాడుతూ తన చర్యలకు తనదే పూర్తి బాధ్యత అన్నాడు. తన సంస్థ సిబ్బందికి క్షమాపణ చెప్పాడు.
అదో పెద్ద పొరపాటు అంటూ వ్యాఖ్యానించాడు. తన చర్యల వల్ల ఫౌండేషన్‌కు కలిగిన ఇబ్బందిపై బిల్‌గేట్స్ విచారం వ్యక్తం చేశాడు. మరోవైపు ఎప్స్టీన్ చేసిన చట్టవ్యతిరేక కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. తను చట్ట వ్యతిరేకంగా ఎలాంటి తప్పూ చేయలేదని, ఎప్స్టీన్ బాధితులు, అతడితో ఉన్న మహిళలతో తనకేం సంబంధం లేదని స్పష్టం చేశాడు. అయితే, ఇద్దరు రష్యన్ మహిళలతో తనకు సంబంధాలు ఉన్నాయని గేట్స్ అంగీకరించాడు. అయితే, ఆ మహిళలకు, ఎప్స్టీన్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. ఎప్స్టీన్ ఫైల్స్‌లో బిల్‌గేట్స్ పేరున్న కారణంగానే ఇటీవల ఆయనను ఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సుకు మన ప్రభుత్వం ఆహ్వానించలేదు.
మరోవైపు గేట్స్ సంస్థ నుంచి ఎప్స్టీన్కు ఎలాంటి చెల్లింపులు జరగలేదని గేట్స్ ఫౌండేషన్ స్పష్టం చేసింది. ఇటీవల విడుదలైన ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఎప్స్టీన్ చేసిన లైంగిక నేరాలపై ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అతడికి సంబంధించిన వీడియోలు, మెయిల్స్‌లో పలువురు ప్రముఖుల పేర్లు ఉండటంపై పెద్ద వివాదమే నడుస్తోంది.