తెలంగాణచౌక్, ఫిబ్రవరి 25: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలని, నీటిని పంపింగ్ చేసి రైతులకు అందించాలని సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యీ చాడ వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలో వచ్చి రెండేండ్లు దాటినా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సాగు సమయానికి ఇవ్వాలిన్సన రైతుభరోసాను మరి కొన్నిరోజుల్లో పంటలు కోతకు వచ్చే సమయానికి కూడా ఇవ్వకపోవడం రైతులకు ఇబ్బందులకు గురిచేయడమేనన్నారు.
మావోయిస్టులను అంతం చేయడం సాధ్యం కాదు..
దేశానికి తిండిపెట్టే రైతులను గోస పెట్టడం సరికాదన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయం బద్ధం ఎల్లారెడ్డి భవనంలో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌తో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలను రూపొందించాలన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లును మంజురు చేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మావోయిస్టులను అంతం చేస్తామని శబథం చేస్తున్నారని, కాని మావోయిస్టు సిద్ధాంతాన్ని అణివేయడం సాధ్యం కాదన్నారు. ఆకలి, అణిచివేత ఉన్నంత వరకు మావోయిజయం ఉంటుందన్నారు.
బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు..
దేశ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి ఆపరేషన్ కగార్ పేరుతో వేలాది మంది మిలటరీతో మావోయిస్టులను అణివేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్‌కుమార్ కరీంనగర్ అభివృద్ధికి తీసుకొచ్చిన నిధులేమీ లేవన్నారు. కానీ మావోయిస్టుల మీద అనుచితంగా మాట్లాడడం సరికాదని, జిల్లా అభివృద్ధికి పాటుపడితే మంచిదన్నారు.
మతతత్వ బీజేపీకి తెలంగాణలో స్థానంలేదన్నారు. వామపక్షాల పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. నాగర్‌కర్నూర్ జిల్లా కొమ్మెరలో బీసీల దాడి సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, బుచ్చన్నయాదవ్, కౌన్సిల్ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.