ఆగస్టు 15 వచ్చిందంటే ఊరూరా త్రివర్ణ పతాక రెపరెపలు కనిపిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలపై కనిపించే నాలుగు సింహాల జాతీయ చిహ్నం కూడా మనకు అంతే పరిచయం. కానీ, ఈ రెండు జాతీయ ప్రతీకల రూపకల్పన వెనుక ఒక హైదరాబాద్ దంపతుల ముద్ర ఉందన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు. వారే సురయా తయ్యాబ్జీ, బద్రుద్దీన్ తయ్యాబ్జీ.
1947 సంవత్సరంలో స్వాతంత్య్రం సమీపిస్తున్న వేళ కొత్త భారతదేశానికి ఒక జాతీయ చిహ్నం అవసరమైంది. బాబూ రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీలో బద్రుద్దీన్ తయ్యాబ్జీ సభ్యుడిగా ఉన్నారు (ఆయన పేరున్న సివిల్ సర్వెంట్. ఆ తర్వాతి కాలంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గానూ పనిచేశారు). జవహర్లాల్ నెహ్రూ సూచన మేరకు, జాతీయ జెండా సహా జాతీయ చిహ్నాల ఎంపికకు దేశ వ్యాప్తంగా ఆహ్వానాలు పంపారు. వివిధ కళాశాలలు, కళాసంస్థల నుంచి వచ్చిన నమూనాల్లో బ్రిటిష్ చిహ్నాల ప్రభావం కనిపించడంతో, వాటి సరైన రూపకల్పన కోసం అన్వేషణ కొనసాగింది. చివరకు తయ్యాబ్జీ దంపతులు సారనాథ్‌లోని అశోక సింహస్తంభాన్ని భారతదేశానికి తగిన ప్రతీకగా సూచించారు.
అయితే ఆ ఆలోచనకు రూపం ఇచ్చింది మాత్రం స్వతహాగా చిత్రకారిణి అయిన ఆయన భార్య సురయా. నాలుగు దికుల వైపు తిరిగి ఉన్న సింహాలతో కూడిన అశోక సింహస్తంభాన్ని ఆధారంగా తీసుకుని ఆమె గ్రాఫిక్ రూపాన్ని రూపొందించారు. దాన్ని అప్పటి వైస్రాయ్ లాడ్జ్… ఇప్పటి రాష్ట్రపతి భవన్ ముద్రణాలయంలో అచ్చుతీసి పరిశీలించారు. ఆ రూపమే తరువాత భారత జాతీయ చిహ్నానికి పునాది అయింది. త్రివర్ణ పతాకంలోనూ ఇదే తరహా ఆలోచన కొనసాగింది. కాంగ్రెస్ జెండాలో ఉన్న చరఖాకు బదులుగా అశోక చక్రాన్ని జెండా మధ్యలో ఉంచే ఆలోచనకు తయ్యాబ్జీ దంపతులే కీలకంగా వ్యవహరించారు. సురయా తొలిగా నలుపు రంగులో అశోక చక్రాన్ని ఉంచి జెండా డిజైన్ చేసి చూపించారు. నలుపు రంగుకు గాంధీజీ అభ్యంతరం చెప్పడంతో దాన్ని నేవీ బ్లూగా మార్చారు. అలా తొలిసారి జెండాను కచ్చితమైన వర్ణాలలో, ఖాదీతో ఢిల్లీలో ఆమే దగ్గరుండి కుట్టించారు. అలా 1947 జులై 22న మన జెండాను అధికారికంగా ఆమోదించి, దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిపారు.
మత ప్రాతిపదికన దేశం విడిపోయినప్పుడు కూడా ముస్లింలు అయిన ఈ దంపతులు విభిన్న సంస్కృతుల కలబోత అయిన భారత్‌లోనే ఉండటానికి ఇష్టపడ్డారు. దీని ఉనికిని స్పష్టంగా, ఉన్నతంగా ప్రకటించడంలో భాగస్వాములయ్యారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు ఎంతో దగ్గరిగా మెదలుతూ ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారు. ఇక, ఈ చిహ్నాల ఎంపికను పెద్దలు కూడా ఆమోదించడానికి కొన్ని కారణాలున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశానికి బ్రిటిష్ పాలనకు ముందు ఉన్న సొంత చారిత్రక గుర్తింపును చూపించే ప్రతీక కావాలి. అశోకుడి సారనాథ్ సింహస్తంభం అందుకు సరిపోయింది. అది ఒక రాజు అధికారానికి సంబంధించిన చిహ్నం కావడంతో పాటు, సారనాథ్ బుద్ధుడి తొలి ధర్మబోధకు సంబంధించిన ప్రదేశం కావడం వల్ల… ధర్మం, నైతిక పాలన, శాంతి, భారతీయ నాగరికత వంటి భావాలతో అనుసంధానమైంది.
ఇక, అందులోని నాలుగు సింహాలు నాలుగు దిశలకు తిరిగి ఉండటం వల్ల విశ్వవ్యాప్త అధికారానికి, ధైర్యానికి ప్రతీకగా భావించవచ్చు. కాబట్టి త్యాబ్జీ దంపతుల ఆలోచనలో అసలు గొప్పదనం కొత్తగా ఒక చిహ్నాన్ని సృష్టించడం కాదు, భారత చరిత్రలో అప్పటికే ఉన్న ఒక గొప్ప ప్రతీకను గుర్తించి, కొత్త గణతంత్ర భారతదేశానికి తగినట్టు ఆధునిక రూపంలో ముందుకు తీసుకురావడంగా భావించవచ్చు. ఈ విషయాన్ని వారి కుమార్తె లైలా త్యాబ్జీ కూడా తన తల్లిదండ్రులు ‘జాతీయ చిహ్నాన్ని రూపకల్పన చేశాం’ అన్నట్టు కాకుండా… భారత చరిత్రలోనే ఉన్న ఒక గొప్ప ప్రతీకను కొత్త భారతదేశానికి గుర్తింపుగా తీసుకొచ్చామని భావించేవారని జ్ఞాపకం చేసుకుంటారు.
– ఇన్పుట్ : లైలా తయ్యాబ్జీ
(సురయా తయ్యాబ్జీ, బద్రుద్దీన్ తయ్యాబ్జీల కుమార్తె)