Black Coffee | చాలా మంది రోజూ ఉదయం పూట బ్లాక్ కాఫీని తాగుతూ ఉంటారు. బ్లాక్ కాఫీ శరీరంలో శక్తిని, చురకుదనాన్నిపెంచుతుంది. శరీరానికి ఒక కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది అని చెప్పవచ్చు. ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బ్లాక్ కాఫీ ఎంతో చక్కగా పని చేస్తుంది. అయితే బ్లాక్ కాఫీ కాలేయ ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మీకు తెలుసా. బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధితో పాటు కాలేయానికి నష్టం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే అప్పుడప్పుడు జీవక్రియ సంబంధిత అనారోగ్య సమస్యలు కూడా అనేకం తలెత్తుతుంటాయి. కాలేయంపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఇలాంటి తరుణంలో బ్లాక్ కాఫీ కాలేయ ఆరోగ్యానికి మంచిదా.. కాదా.. బ్లాక్ కాఫీ కాలేయానికి ఏవిధంగా మేలు చేస్తుంది.. బ్లాక్ కాఫీ కాలేయ ఆరోగ్యంపై ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తుంది.. బ్లాక్ కాఫీ తీసుకోవాలా.. వద్దా వంటి విషయాల గురించి వైద్యులు ఏమంటున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ కాఫీ క్రమం తప్పకుండా తాగే వారిలో, రోజుకు రెండు నుండి మూడు కప్పులు తాగే వారిలో కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీ ఆరోగ్యకరమైన కాలేయ ఎంజైమ్ స్థాయిలను పెంచడంలో, కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆధారాలు సూచిస్తున్నాయి. ATL, AST, GGTP వంటి ఎంజైమ్ లు కాలేయ పనితీరును సూచిస్తాయి. ఈ ఎంజైమ్ లు ఎంత ఎక్కువగా ఉంటే కాలేయ పనితీరు, డిటాక్సిఫికేషన్ అంత చక్కగా ఉన్నట్టు అర్థం. బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఈ ఎంజైమ్ ల స్థాయిలు పెరిగి కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఇప్పటికే కాలేయ సమస్యలతో బాధపడే వారు బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ సంబంధిత ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడే వారు రోజుకు రెండు కంటే ఎక్కువ కప్పుల బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల ఫైబ్రోసిస్, సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే దీర్ఘకాలిక కాలేయ సమస్యలతో బాధపడే వారు క్రమం తప్పకుండా కాఫీని తీసుకోవడం వల్ల మరణాల సంఖ్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, సహజ సమ్మేళనాలు, పాలీఫినాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ కణాలను రక్షించడంలో, జీవక్రియ ప్రక్రియలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాఫీ తాగని వారి కంటే కాఫీ తాగే వారిలో ఆరోగ్యకరమైన కాలేయ పనితీరును చూడవచ్చని కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక కాఫీ కాలేయ ఆరోగ్యానికి మంచిది కదా అని దీనిని ఎక్కువగా కూడా తీసుకోకూడదు. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల మోతాదులో మాత్రమే తీసుకోవాలి. కాఫీని ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్రలేమి, జీర్ణాశయంలో చికాకు, యాసిడ్ రిఫ్లెక్స్ పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీ నివారణ మందు లాటింది కాదని కానీ మితంగా తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.