అమరావతి : ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Minister Rambabu) పోలీసు యంత్రాంగంపై మండిపడ్డారు. నిన్న జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో విఫలమైందని ఆరోపించారు. టీడీపీ నాయకులు ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడుతుంటే పోలీసులు(Police) స్పందించలేదని అన్నారు. అభ్యర్థిగా తనను కూడా పోలింగ్ బూత్ (Polling Booth లల్లో తిరుగకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు . తన నియోజకవర్గంలోని దమ్మాలపాడు, నార్నేపాడులో రిగ్గింగ్ జరిగిందని, ఇక్కడ రీ పోలింగ్ జరుపాలని డిమాండ్ చేశారు.
సత్తెనపల్లి, నరసారావుపేట నియోజకవర్గంలో కనివినీ రీతిలో హింస జరిగిందని ఆరోపించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించ లేదని మండిపడ్డారు. జిల్లా పోలీసు యంత్రాంగం టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యరా అనే అనుమానాలు వ్యక్తం చేశారు.
రాంబాబు అనే రూరల్ ఎస్ఐ డబ్బులు తీసుకుని టీడీపీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలీసుల ఆగడాలపై ఎన్నికల సంఘం అధికారులు విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. అసలు ప్రభుత్వంలో ఉన్నామా? లేమా? అనే దుస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో మహిళల ఓటింగ్ శాతం పెరుగడం వల్ల అధికార వైసీపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని భావిస్తున్నామని మంత్రి వెల్లడించారు. వైసీపీ అందించిన ప్రభుత్వ పథకాలను మెచ్చి 70 శాతం మంది మహిళలు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారని తెలిపారు.