Transfer | తెలంగాణకు బదిలీ చేయలేదనే ఆవేదనతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడంటూ సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఏపీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పష్టం చేసింది.
అవినాష్ సింగ్ అనే వ్యక్తి తెలంగాణకు ట్రాన్స్ఫర్ కావాలని పలుమార్లు అర్జీ చేసుకున్నాడని.. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా కమిషనర్ పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించాడని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. తనను తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయకపోతే చనిపోతానని సీఎస్‌కు సైతం లెటర్ రాశాడని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఆత్మహత్యకు యత్నించిన అవినాష్ సింగ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సోషల్‌మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీటిపై తాజాగా స్పందించిన ఏపీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం.. అదంతా ఫేక్ ప్రచారమని కొట్టిపారేసింది.
ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు వారి కార్యాలయం (ఏపీ సచివాలయం పబ్లిసిటీ సెల్)లో అవినాష్ సింగ్ ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్నారని ఫ్యాక్ట్‌చెక్ విభాగం తెలిపింది. తనను తెలంగాణకు బదిలీ చేయకపోవడంతో ఆత్మహత్య ప్రయత్నం చేశాడని Feed(@ Telugu feedsite) అనే సోషల్‌మీడియా ఖాతాలో వైరల్ అవుతున్న కథనం పూర్తిగా నిరాధారమని పేర్కొంది. తాను ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని అవినాష్ సింగ్ స్వయంగా వీడియో ద్వారా తెలియజేశారని స్పష్టం చేసింది. ఆ కథనం పూర్తిగా అసత్యమని తెలిపింది.
అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల మేరకు ( కమిషనర్ లేఖ తేదీ 19/02/2026) అంతరాష్ట్ర బదిలీల ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పష్టం చేసింది. తెలంగాణకు బదిలీ కోరుకుంటున్న ఉద్యోగుల జాబితాలో (క్రమసంఖ్య 472) స్పష్టంగా ఉందని తెలిపింది.
దీనికి సంబంధించిన డేటాను అప్డేట్ చేసి, తదుపరి చర్యల కోసం తెలంగాణ ప్రభుత్వానికి పంపించామని పేర్కొంది. బదిలీల ప్రక్రియ సజావుగా సాగుతున్న సమయంలో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కేవలం ప్రజలు, తోటి ఉద్యోగులను గందరగోళానికి గురిచేయడమే అవుతుందని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు వారి కార్యాలయం(ఎపి సచివాలయం పబ్లిసిటీ సెల్)లో ఆఫీస్ సబార్డినేట్ గా పని చేస్తున్న ఎస్.అవినాష్ సింగ్ తనను తెలంగాణకు బదిలీ చేయకపోవడంతో ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడినట్టు Telugu Feed(@ Telugu feedsite)అనే సోషల్ మీడియాలో వైరల్… pic.twitter.com/RvwmF5xPTm
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) March 9, 2026