Health Tips | మన ఆరోగ్యం విషయంలో శరీరం ఎన్నో సంకేతాలను మనకు తెలియజేస్తూ ఉంటుంది. అయితే వాటి గురించి మనం అంతగా పట్టించుకోం. అయితే చాలావరకు ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తిస్తే వాటినుంచి వీలైనంత వరకు బయటపడగలుగుతాం. అంటే రోగ నిర్ధారణ, చికిత్స విషయంలో ఆలస్యం అమృతం విషం అనే సామెతను గుర్తుకు తెచ్చుకోవాలి. తొందరపడాలి. గుండెపోటు అకస్మాత్తుగా వచ్చిందనుకుంటాం. కానీ, దానికి ముందు శరీరం కొన్ని సంకేతాలు పంపుతుంది. వాటిని సకాలంలో గుర్తించి, వైద్యుణ్ని సంప్రదిస్తే.. మీ గుండె పదికాలాలూ లయబద్ధంగా కొట్టుకుంటుంది. గుండెపోటుకు బలమైన సంకేతం ఛాతీ నొప్పి. ఛాతీలో నొప్పిగా అనిపించిన ప్రతీసారి అది గుండెపోటుకు దారితీయకపోవచ్చు. పైగా ఛాతీనొప్పి ఒక్కొక్కరిలో ఒక్కోలా వస్తుంది. అయితే ఛాతీమీద ఎక్కువ కాలంపాటు ఒత్తిడిపడటం, లేదంటే ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం తరచూ వచ్చే సమస్యలు.
సాధారణంగా ఛాతీలో నొప్పి అంటే ఎడమ భుజం వైపు ఛాతీ మధ్య నుంచి పై భాగంలో వస్తుంది. కొన్నిసార్లు ఎడమ భుజం లేదా దవడ వరకూ వ్యాపించే అవకాశం ఉంది. ఛాతీనొప్పి కారణంగా పురుషులలో కంటే స్త్రీలలో మగత లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పైగా మహిళల్లో గుండెపోటుకు ఛాతీనొప్పిని ముందస్తు హెచ్చరికగా భావించాలి. ఛాతీనొప్పిని చాలామంది అజీర్ణం కారణంగా తలెత్తిన సమస్యగా కొట్టిపారేస్తారు. కానీ మీరు విశ్రాంతిగా ఉన్నప్పుడు అసౌకర్యం తొలగిపోయి, వ్యాయామం, శారీరక శ్రమ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం అది అజీర్ణం నుంచి వస్తున్న నొప్పిగా భావించొద్దు. చెమటలు పట్టడం, తలలో తేలికగా ఉండటం, వికారం, వాంతులు, శ్వాస తక్కువ సమయం కొనసాగడం, ఈఆర్కు వెళ్లడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు తప్పకుండా వైద్యుణ్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.