Medak | మెదక్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు మల్లికార్జున గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ ఎన్నికల మసయంలో కాంగ్రెస్ నాయకులతో పాటు ఎమ్మెల్యేపై దాడి చేసి, హత్యకు యత్నించారని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే 13 మంది బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి సంగారెడ్డి జైలులో ఉంచగా.. తాజాగా మల్లికార్జున గౌడ్‌ను అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మెదక్ పట్టణంలోని మల్లికార్జున గౌడ్ నివాసానికి శనివారం తెల్లవారుజామున భారీగా పోలీసులు మోహరించారు. ఇంట్లోకి వెళ్లి ఆయన్ను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున మల్లికార్జున గౌడ్ నివాసానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్టులు చేస్తున్నారని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో మల్లికార్జున రెడ్డిని అరెస్టు చేసి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.